రంగారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. తాము అధికారంలోకి రాగానే కౌలు రైతులకు కూడా రైతుభరోసా అందిస్తామని.. ఆశ చూపి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా మోసం చేస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. మూడు సీజన్లు కావొస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులకు మాత్రం రైతు భరోసా అందడం లేదు. ఈ వానకాలంలోనైనా రైతుభరోసా వస్తుందని ఆశతో ఎదురు చూసి న కౌలు రైతులకు నిరాశే మిగిలింది. ప్రసుత్తం జిల్లాలో 90,000 నుంచి 1,00,000 వరకు కౌలు రైతులున్నారు.
వారికి ప్రతి ఏటా అప్పులే తప్పా ఆదాయం లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా మారింది. వానకాలం పంటల సాగుకు వారు మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. గత యాసంగిలో కౌలు రైతు లు అప్పులుచేసి పంటలు సాగు చేయగా అతివృష్టి, అనావృష్టితో పంటలు నాశనమై పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఈ వానకాలం లోనైనా పంటలను సాగుచేసి గత యాసంగి నష్టాన్ని పూడ్చుకుందామనుకుంటే పెట్టుబడి దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో 3,00,000కు పైగా రైతులున్నారు. జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూము లు కలిగిన పట్టాదారులంతా నగరంలోనే నివసిస్తూ తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రసుత్తం జిల్లాలో 90,000 నుంచి 1,00,000 వరకు కౌలు రైతులున్నారు. వీరంతా పట్టాదారుల నుంచి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పంటలు పండినా…పండకపోయినా ఎకరాకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఇవ్వక తప్పడంలేదు. కౌలు రైతులు పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. కాగా, గత యాసంగిలో అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్రంగా నష్టం కలిగింది. దీంతో కౌలు రైతులకు దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొన్నది. వరి, పత్తి, ఇతర పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో ఏటా కౌలు రైతులూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
పత్తి రైతులకు కూడా అప్పులే మిగులుతున్నాయి. జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. పత్తిని సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులు మీద పడుతున్నాయి. మరోవైపు పండించిన పంట కూలీలు, కౌలుకు పోగా తమకు మాత్రం ఏమీ మిగలడం లేదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కౌలు రైతులు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా.. పంటను స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వారికి పట్టా పాసుపుస్తకాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. పంటను అమ్ముకునేందుకు పట్టా పాస్‌బుక్కులు కలిగిన రైతులను బతిమిలాడాల్సి వస్తున్నది. ఇన్ని విధాలా అవస్థలు పడుతున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి కూడా రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించాలి.