కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని తదితర హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వం రైతులకు మరోసారి అన్యాయం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.2 లక్షల్లోపు రుణమాఫీ అంటూ అర్హులైన లక్ష మంది రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసాలోనూ అదే తీరును వ్యవహరిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు ఏడాదికి రూ.10 వేల రైతు బంధు సాయాన్ని అందజేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని అబద్ధపు హామీలనిచ్చి.. ప్రస్తుతం రూ.12 వేలు ఇస్తామంటూ రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తున్నది. దీనికితోడు లేనిపోని కొర్రీలు పెట్టి అర్హులనూ తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నది. ఇందుకుగాను సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ-వ్యవసాయ శాఖలకు బాధ్యతలను అప్పగించింది.
జిల్లాలో సుమారు లక్ష ఎకరాల వరకు కోత విధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 12.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో అర్హులైన వారిని గుర్తించి ప్రతీ సీజన్‌కు 6 లక్షల ఎకరాలకు రూ.300 కోట్లకుపైగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ భూముల్లో నెలకొల్పిన పరిశ్రమలతోపాటు లే అవుట్లు ఇతరత్రా వివరాలను సేకరించిన ప్రభుత్వం వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే ప్రతీ గుంటకు పెట్టుబడి సాయాన్ని అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని కొర్రీలు పెట్టి రైతు భరోసాలో కోత పెట్టే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తున్నది.
– వికారాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.15 వేల పెట్టుబడి సాయం అందజేస్తామని హామీనిచ్చి… ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామన్న ప్రకటనతో రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఇటీవల రైతు భరోసాకు సంబంధించి సమావేశమైన మంత్రిమండలి సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పట్టాదారు పాసు పుస్తకాలను పరిగణనలోకి తీసుకోకుండా రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులకు అన్యాయం చేసింది. అదే తీరును రైతు భరోసాలోనూ వ్యవహరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ పథకంలోనూ కోతలు విధిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఎకరాకు రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.2926 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేశారు. 2018 వానకాలం సీజన్లో 1,94,833 మంది రైతులకుగాను రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 1,78,998 మంది రైతులకుగాను రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మంది రైతులకు రూ.194 కోట్ల పెట్టుబడి సాయం, 2020 వానకాలం సీజన్లో 2,113,341 మంది రైతులకు రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మంది రైతులకు రూ.301 కోట్లు, 2021 వానకాలం సీజన్లో 2,25,438 మంది రైతులకు రూ.300 కోట్లు, యాసంగిలో 2,24,928 మంది రైతులకు రూ.241 కోట్ల పెట్టుబడి సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,47,707 మంది రైతులకు రూ.305 కోట్లు, యాసంగిలో 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్లు, 2023-24 వానకాలం సీజన్లో 2,62,065 మంది రైతులకు రూ.307.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసింది.