ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. సోమవారం ఒక ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును జమ చేసింది. సకాలంలో పంట పెట్టుబడి చేతికందుతుండడంతో అన్నదాతలు సంబురాలు చేసుకుంటున్నారు. డబ్బులు క్రెడిట్ అయిన మెసేజ్‌లను చూసుకొని మురిసిపోతున్నారు. మొదటిరోజు రంగారెడ్డి జిల్లాలో 1,24,147 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 34.8కోట్లు జమకాగా, వికారాబాద్ జిల్లాలో 74,236 మంది ఖాతాల్లో రూ.23.11 కోట్లు జమయ్యాయి. నేడు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న అన్నదాతలకు సాయం అందనున్నది.
వికారాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖా తాల్లో జమ అవుతున్నది. సోమవారం నుంచి రైతుల ఖాతా ల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే తొలుత ఎకరం వరకు భూమి గల రైతులకు రైతుబంధు సహాయాన్ని జమ చేయగా.. నేడు రెండు ఎకరాల భూమిగల రైతుల బ్యాంకు ఖాతా ల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ కానున్నది. అయితే ప్రభుత్వం సోమవారం జిల్లాలో ఎకరంలోపు భూమిగల 74,236 మంది ఖాతాల్లో రూ.23.11 కోట్లను జమ చేసింది. పంట పెట్టుబడి సా యాన్ని అందించి ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతలు అప్పులబారిన పడకుండా రైతుబంధు పథకంతో ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకు తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అదేవిధంగా జిల్లాలో వానకాలం సీజన్‌కుగాను 2,88,834 మం ది రైతులను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించా రు. అయితే యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈ వానకాలంలో కొత్తగా 27,000 మంది రైతులు అర్హులుగా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. అదేవిధంగా గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్ల రైతుబంధు సహాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది.
రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్ర భుత్వం గత ఆరేండ్లుగా అమలు చేస్తున్నది. ఏడాదికి ఎకరానికి రూ. పదివేల చొప్పున రెండు విడుతల్లో సాయాన్ని అందిస్తున్నది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేందుకు నేరుగా రైతుల బ్యాం కు ఖాతాల్లోనే సాయాన్ని జమ చేస్తున్నది. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,622 కోట్ల సాయాన్ని జిల్లాలోని రైతు లకు అందించింది.
2018 వానకాలంలో 1,94,833 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మందికి రూ. 206 కోట్లు, 2019 వానకాలంలో 1,78,998 మందికి రూ. 255 కోట్లు, యాసంగిలో 1,71,824 మందికి రూ.194 కోట్లు, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297 కోట్లు, యా సంగిలో 2,19,264 మంది కి రూ.301 కోట్లు, 2021 వానకాలంలో 2,25,438 మంది కి రూ.300 కోట్లు, యాసంగిలో 2,24,928 మంది రైతులకు రూ.241 కోట్లు, 2022-23 వానకాలం సీజన్లో 2, 47,707 మందికి రూ.305 కోట్లు, యాసంగిలో 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించింది.
రంగారెడ్డి జిల్లాలో రూ. 34.8 కోట్లు జమ
షాబాద్, జూన్ 26 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రైతులు పంటల సాగు కోసం అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశంతో రైతుబంధు పథ కాన్ని తీసుకొచ్చి ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున ఏడాదికి రెండు విడుతలుగా రూ.పది వేలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం సోమవారం నుంచి డబ్బులను అందజేస్తున్నది. మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో ఎకరం భూమి ఉన్న రైతులు 1,24,147 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.ఐదువేల చొప్పున రూ.34.8 కోట్లు జమ అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అదునుకు పంట పెట్టుబడి సాయం అందించడం సంతోషకరమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1,24,147 మంది రైతులకు..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొదటి రోజు మొత్తం 1,24,147 మంది రైతుల ఖాతాల్లో రూ.ఐదు వేల చొప్పున ప్రభుత్వం రూ. 34.8 కోట్లు జమ చేసింది. ఎకరం, రెండు ఎకరాలు ఇలా పది రోజుల పాటు అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటా..
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణ పడి ఉంటా. పంటల సాగుకు ప్రభుత్వం సీజన్ ఆరంభానికి ముందే ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకుంటున్నది. నాకు ఎకరం పొలం ఉండగా.. రైతుబంధు కింద ప్రభుత్వం నుంచి సోమవారం రూ.ఐదు వేలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు నా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది.
– యువ రైతు చాపల శ్రీనివాస్,రాకొండ గ్రామం,దోమ మండలం
వ్యవసాయం పండుగలా సాగుతున్నది
గతంలో వ్యవసాయం చేయాలంటే ఇబ్బందులు పడేటోళ్లం. పంటలకు పెట్టుబడి కష్టంగా ఉండే ది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం, యాసంగి సీజన్లలో రెండు సార్లు రైతుబంధు కింద ఎకరానికి రూ.పది వేల చొప్పున అందించి ఆదుకుంటున్నది. గతంలో వడ్డీ వ్యా పారులు, ఇతరుల వద్దకెళ్లి అప్పులు తీసుకు రావాల్సి వచ్చేది.. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వ్యవసాయం పండుగలా సాగుతున్నది.
-వెంకటయ్య రైతు, రుద్రారం గ్రామం, ధారూరు మండలం
లాగోడి రంది తప్పింది..
వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు పనులు ఊపందుకున్నాయి. టైమ్‌కు ప్రభుత్వం పెట్టుబడి డబ్బులు అందిస్తుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతున్నది. లాగోడి రంది తప్పింది. నేరుగా ఖాతాల్లో జమచేయడం సంతోషంగా ఉన్నది. -సిరిపురం మల్లేశం, రైతు , జిన్నారం గ్రామం, కోట్‌పల్లి మండలం
సకాలంలో పంటలను సాగు చేస్తున్నా..
రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నా రు. ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నాకు మూడెకరాల భూమి ఉన్నది. పది విడుతలుగా ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో అవసరమైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి సకాలంలో పంటలను సాగు చేశా. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టి అన్నదాతలను ఆదుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
-దుర్గయ్య,టేకులపల్లి,మోమిన్‌పేట
సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. గతంలో పంటల సాగుకు వడ్డీ వ్యాపారులు, ఇతరుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తు తం ప్రభుత్వం ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. పది వేలను అందించి ఆదుకుంటున్నది. దీంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నా. ఎలాంటి ఇబ్బందుల్లేవు.
-చిరంజీవి రెడ్డి, రైతు మర్పల్లి మండలం
రైతుల ఇబ్బందులు దూరమయ్యాయి..
సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక ఇబ్బందులను దూరం చేశాడు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారులు, ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చే విత్తనాలు, ఎరువులను కొను గోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పాయి. రైతులు తమ పంటలను విక్రయించుకుని ఆనందంగా జీవిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి రైతూ సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణ పడి ఉంటాడు.
-చాకలి రాములు, రైతు, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్
అదునుకు సాయం అందుతున్నది
నాకు 11 గుంటల భూమి ఉండగా.. రైతుబంధు పథకం కింద రూ.1375 నా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యా యి. వచ్చిన పైసలతో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటా. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్నాడు. అదునుకు సాయం అందించి ఆదుకుంటున్నారు.
-ఈర్లపల్లి కృష్ణ, చౌదర్పల్లి, బొంరాస్‌పేట మండలం
రైతుబంధుతో పెట్టుబడి రంది తీరింది
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పంటలను సాగు చేయాలంటే అప్పుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేది. కానీ.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నదాతల ఇబ్బందులను తీర్చేందుకు తీసుకొచ్చిన రైతుబంధు పథకంతో ఆ రంది తీరింది. ప్రతి సీజన్‌కూ ముందుగానే పంటల సాగుకోసం ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నది. రైతుబంధు పథకంతో సకాలంలో పంటను సాగు చేసుకుంటాననే నమ్మకం కలిగింది. అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు రైతులందరూ రుణపడి ఉంటారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు రైతుబంధు గొప్పవరంలా మారింది. ఎక్కడా ఇలాంటి పథకాలు లేవు. కేవలం సీఎం కేసీఆర్ కృషితోనే రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
– కొండయ్యగౌడ్ సాల్వీడ్, కులకచర్ల మండలం
అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయి
సీఎం కేసీఆర్ సన్న, చిన్నకారు రైతులకు అండగా నిలిచారు. ప్రతి ఏటా రెండు సీజన్లలో ఎకరానికి రూ.పది వేల చొప్పున అందించి ఆదుకుంటున్నారు. తద్వారా అన్నదాతలు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో కొనుగోలు చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయి.ఆయనకు రైతులందరూ అండగా ఉండాలి
-అంజయ్య రైతు, మిర్జాగూడ గ్రామం,శంకర్పల్లి మండలం
రైతుబంధుతో ఆనందం
నాకున్న కొద్ది పాటి పొలాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో రైతుబంధు పథకంతో రైతులు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఏటా యాసంగి, వానకాలం సీజన్లలో పంటల సాగుకు ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. నా ఫోన్‌ను డబ్బులు జమ అయ్యినట్లు మెసేజ్ వచ్చింది.
-బోసుపల్లి చంద్రశేఖర్. ఉప్పరిగూడ ఇబ్రహీంపట్నం
నా బ్యాంకు ఖాతాలో రూ. 3,375 జమ అయ్యాయి
సీఎం కేసీఆర్ సార్ పంటల సాగుకు అదునుకు ముందే డబ్బులు ఇస్తుండు. రైతుబంధు పథకం కింద రూ. 3,375 సోమవారం నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పైసలు విత్తనాలు, ఎరువులు కొనేందుకు ఎంతో అవసరమవుతాయి. అం తేకాకుండా వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ప్రతినెలా పింఛన్ డబ్బులు అందిస్తూ ఆదుకుంటున్నా డు. ఇంత మంచి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఆయన పెద్ద కొడుకులా ముసలివారిని ఆదుకుంటూ అండగా ఉంటున్నారు.
-బేగరి గండమ్మ, సురంగల్, మొయినాబాద్
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. రైతులు పం టల సాగుకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నారు. నా పేరున ఇరవై గుంటల భూమి ఉండగా రూ.2,250 డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఆ పైసలతో విత్తనాలు, ఎరువులను కొంటా. నాలాంటి పేద రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-బుట్టి మహేశ్, యువరైతు ఎలిమినేడు, ఇబ్రహీంపట్నం రూరల్
విత్తనాలు, ఎరువులు కొంటా..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం సంతోషకరం. రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.పది వేలను రైతన్నల బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తున్నది. వానకాలానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున అందించి అన్నదాతలను అందించి ఆదుకుంటున్నారు. నాకున్న భూమికి సరిపడా రైతుబంధు డబ్బులొచ్చాయి. వాటితో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తా.
-మాధవగౌడ్ రైతు , కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం
పెట్టుబడి సాయం.. సాగుకు ఎంతో ఉపయుక్తం..
సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. అన్నదాతలు పంటల సాగుకు ఇబ్బంది పడొద్ద నే ఉద్దేశంతో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెట్టుబడి సాయాన్ని అందిం చి ఆదుకుంటున్నారు. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. ఇప్పటివరకు పది విడుతలుగా పెట్టుబడి సాయం వచ్చింది. ఆ డబ్బులతో విత్తనాలు, ఎరువులను కొన్నా. ఇప్పుడు వచ్చే డబ్బులు పంటల సాగుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇంత మంచి పథకాన్ని అమలు చేస్తున్న సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటా.
-ఎర్ర మల్లేశ్, రైతు, ఎర్రోని కొటాల గ్రామం