పరిగి, జూలై 17: గ్రామాల్లో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచగా నేటి కాంగ్రెస్ సర్కారు వాటిని గాలికి వదిలేసింది. కొన్నిచోట్ల నీరు లేక మొక్కలు ఎండిపోగా పరిగి మం డలం రాపోల్ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం మురికినీటితో దుర్గంధ భరితంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గ్రామానికి కొంత దూరంలో ఉండే పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీరు అందించేందుకు బోరు ఏర్పాటు చేశారు.
ఇక్కడివరకు అంతా బాగుండగా గత కొన్ని నెలల క్రితం కొత్త కాలనీ నుంచి మురికినీరు వెళ్లడానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్‌లైన్ తీసుకువెళ్లి పల్లె ప్రకృతి వనం దగ్గర వదిలేశారు. దీంతో కాలనీలోని ఇళ్ల నుంచి వచ్చే మురికినీరంతా ఈ పైప్‌లైన్ ద్వారా పల్లె ప్రకృతి వనంలోకి వెళ్తున్నాయి. ఎండాకాలంలో ఎప్పటి నీరు అదే రోజు భూమిలోకి ఇంకిపోగా ప్రస్తుతం మురికినీరు పల్లె ప్రకృతి వనం లో నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది.
అటు పక్క నుంచి వెళ్తే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మురికినీరు అలాగే ప్రకృతివనంలో రోజుల తరబడి నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా మురికినీటి గుంటలను తలపిస్తుంది. నీరు ప్రకృతి వనం నుంచి బయ టకు వెళ్లేందుకు గ్రామపంచాయతీ వారు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదని, తద్వారా చక్కటి గాలిని అందించాల్సిన పల్లె ప్రకృతివనం దుర్వాసనను వెదజల్లుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి స్పందించి వెంటనే ప్రకృతి వనంలో మురికినీరు నిలవకుండా చూడాలని, తద్వారా ప్రకృతి వనాన్ని కాపాడాలని కోరుతున్నారు.