రంగారెడ్డి, జూలై 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. పలుచోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు ఇండ్లను కూడా కేటాయించింది.
అయితే, అప్పుడే అసెం బ్లీ ఎన్నికలు రావడం..ప్రభుత్వం మారడంతో ఆ ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో లబ్ధిదారులకు కాకుండా తమ అనుచరులకే ఇండ్లను కేటాయించాలని చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 19 నెలలు దాటినా తమకు ఇండ్లను కేటాయించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఆ ఇండ్ల చుట్టూ చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయింది.
పలుచోట్ల ఇండ్ల కిటికీలు, డోర్లనూ ఎత్తుకెళ్లారు. మరోవైపు మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులే సాముహికంగా స్వాధీనం చేసుకుని గృహ ప్రవేశాలు కూడా చేశారు. బయ ట ఇండ్లలో ఉండలేకపోతున్నామని.. ఇండ్లకు అద్దె కట్టలేక తమకు కేటాయించిన డబుల్‌బెడ్ రూమ్‌లకు వచ్చినట్లు వారు పేర్కొంటున్నారు. అయితే, కరెంట్, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు, పోలీసులు వారిని బెదిరించి ఆ ఇండ్ల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం అక్కడే ఉంటున్నారు.
పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం
గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లిలో సుమారు 150 ఇండ్లు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడలో 100, షాద్‌నగర్ మున్సిపాలిటీలో 1783, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి గ్రామంలో 1521, మొయినాబాద్ మండలంలో 56, మంచాల మండలంలోని లింగంపల్లిలో 96, వనస్థలిపురం, బాలాపూర్, తొర్రూరు తదితర ప్రాంతాల్లోనూ వందలాది ఇం డ్లను నిర్మించింది.
పూర్తైనా ఇండ్లను గత కేసీఆర్ ప్రభు త్వం గ్రామసభలు నిర్వహించి డ్రా పద్ధతిలో లబ్ధిదారుల కు కేటాయించింది. ఆ ఇండ్లలో విద్యుత్తు, తాగునీటి సరఫరాతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో వాటిలోకి లబ్ధిదారులు వెళ్లలేక పోయారు. అయితే, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. ఉదేశ్యపూర్వకంగానే లబ్ధిదారులకు ఇవ్వడంలేదన్న ఆరోపణలున్నాయి.
కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు ఆ ఇండ్లను తమ అనుచరులకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం అనర్హులకు కేటాయించిందని, దానిపై విచారణ జరిపించి అర్హులకు పంపి ణీ చేస్తామని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోవైపు హౌసింగ్ అధికారులను బెదిరించి గతంలో డ్రా పద్ధతిలో కేటాయించిన లబ్ధిదారులను తొలగించి తమ అనుచరులకు కేటాయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
లబ్ధిదారులకు అన్యాయం చేస్తే ఊరుకోం..
గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి.. పేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు లబ్ధిదారులకే చెందాలి. రేవంత్ సర్కార్ వాటిని అనర్హులు, తన అనుచరులకు కట్టబెట్టాలని యోచిస్తున్నది. లబ్ధిదారులకు కేటా యించిన ఇండ్లను వేరే వారికి కట్టబెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే