ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. గవర్నర్ వైఖరికి నిరసనగా టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. దీంతో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్‌భవన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికీ సైతం ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
-రంగారెడ్డి, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ‘రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. డిపోల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆర్టీసీ కార్మికులు నిరసనను చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సుల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తును తరలివెళ్లారు. ఆర్టీసీ కార్మికుల నిరసనతో ఉదయాన్నే విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.’
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ మజ్ధూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కదంతొక్కి నిరసనలో పాల్గొన్నారు. డిపోల వద్దనే బస్సులను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. బిల్లు జాప్యానికి కారణమైన గవర్నర్ వైఖరిపై మండిపడ్డారు. గవర్నర్ ఓ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి డిపోల వద్ద కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు. దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బస్సుల రాకపోకలు స్తంభించాయి. రాజ్‌భవన్ ఎదుట నిర్వహించిన నిరసనకూ పలువురు కార్మికులు తరలివెళ్లారు. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు నిరసన ప్రభావం ప్రజానీకంపై పడింది. ఉదయం వేళల్లో విద్యా సంస్థలకు, కార్యాలయాలు, ఇతర పనులకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడ్డారు. వారంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
వికారాబాద్ జిల్లాలో..
ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయం ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రెండు గంటల పాటు ఆర్టీసీ ఉద్యోగులు గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకుగాను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపగా తాత్సారం చేయడంపై జిల్లాకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు రెండు గంటల పాటు డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. వికారాబాద్, పరిగి, తాండూరు డిపోల్లోని ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 8 గంటల తర్వాతే డిపోల నుంచి బస్సులు కదిలాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తాండూరు, ఆగస్టు 5 : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపనందుకు నిరసిస్తూ శనివారం తాండూరు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 గంటల వరకు ఆర్టీసీ బస్సులను కదపకుండా డిపో ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కలుగుతాయన్నారు. గవర్నర్ ఆర్టీసీ ఉద్యోగులు బాధను అర్థం చేసుకుని బిల్లుకు ఆమోదం తెలుపాలన్నారు. ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగకుండా వెంటనే ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
పరిగి, ఆగస్టు 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఆమోదించకుండా గవర్నర్ మోకాలడ్డడం సరికాదని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం టీఎంయూ పిలుపు మేరకు ఉదయం 8 గంటల వరకు పరిగి ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు బయటకు తీయకుండా డిపో ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సురేశ్, హన్మంతు, చారి, శ్యాంసుందర్, రఘు తదితరులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూసుకునేందుకు వీలుగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం సంతోకరమన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం బాధకరమన్నారు. రాష్ట్ర గవర్నర్ తాత్సారం చేయకుండా వెంటనే బిల్లును ఆమోదించాల్సిందిగా వారు పేర్కొన్నారు.
షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 5 : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ అడ్డుతగలడం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మండిపడ్డారు. అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై అనుమతించకపోవడంతో శనివారం షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారు జాము నుంచి ఉదయం 8 గంటల వరకు నిరసన తెలిపారు. దీంతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మేలు కోరుతుంటే గవర్నర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల కష్టాలను కోరుతున్నట్లు కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు హన్మంత్, నర్సింహులు, స్వాములయ్య, తిరుపతయ్య, సీతమ్మ, అలీ, ఆసామియా, నాగరాజు, మెయింటెనెన్స్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
వికారాబాద్, ఆగస్టు 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపగా, ఆమోదం తెలుపక పోవడం సరైన పద్ధతి కాదని వికారాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీఎంయూ పిలుపు మేరకు వికారాబాద్ ఆర్టీసీ డిపోలో ఎదుట ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వివిధ రూట్లలోకి వెళ్లే బస్సులను నిలిపి వేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్ బిల్లు ఆమోదించకపోవడం సరికాదు. ఆర్టీసీ ఉద్యోగులమంతా ప్రభుత్వ ఉద్యోగులం కాకూడదన్న అక్కసుతో ఇలా చేస్తున్నారనిపిస్తున్నది. రాష్ట్రంలో 43,373 మంది ఉద్యోగుల భవిష్యత్తును గవర్నర్ అర్థం చేసుకోవాలి. లేదంటే ఆర్టీసీ కార్మికులం జంగ్ సైరన్ మోగించనున్నాం.
– అహ్మద్ పాషా(E215231), కండక్టర్, తాండూరు డిపో
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం గవర్నర్ తమిళిసైకు ఇష్టం లేనట్లుంది. మా హక్కులకు భంగం కలిగించడం ఆర్టీసీ ఉద్యోగులకు చీకటి రోజు. బిల్లును ఆమోదించని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– నవీన్ గౌడ్(E218272), కండక్టర్, తాండూరు డిపో
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై తాత్సారం చేయకుండా ఆమోదం తెలుపాలి. 43వేల ఉద్యోగులకు సంబంధించిన అంశం, ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి వీలుగా వెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేయాలి.
– వై.ఆర్.ఎన్.రెడ్డి, కండక్టర్, ఆర్టీసీ పరిగి డిపో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగా ఉన్నది. ప్రభుత్వం అందజేసిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదం తెలుపాలి. ఎన్నో ఏండ్లుగా కష్టాలు పడుతున్న వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాల్సిందే. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం.
– మహేశ్వరీ, ఆర్టీసీ మహిళా ఉద్యోగి, వికారాబాద్
తొమ్మిది ఏండ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా గొప్ప విషయం. గవర్నర్ రాజకీయం చేయడం సరికాదు. ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం జరుగకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రభుత్వం అందించిన బిల్లును గవర్నర్ ఆమోదించాలి.
– మల్లమ్మ, ఆర్టీసీ ఉద్యోగి, వికారాబాద్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపితే బిల్లును ఆమోదించకపోవడం దుర్మార్గ చర్య. ఆర్టీసీ కార్మికుల బాగు కోసం రాష్ట్ర సర్కార్ సాహసోపేత నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్ అడ్డుకోవడం సరికాదు.
– కె.సురేశ్‌బాబు, కండక్టర్ పరిగి డిపో
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆమోదించకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. దీంతో ఉదయం 9 గంటల వరకు ఒక్కబస్సు కూడా బయటకు వెళ్లలేదు. డిపోకు చెందిన అన్ని యూనియన్ల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం డిపోకు చేరుకున్నారు. డిపో మెయిన్‌గేటు ఎదుట ఆందోళన చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కార్మికులు పాల్గొన్నారు.