Farmers | వికారాబాద్, జూలై 6 : వికారాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన మిషన్ ద్వారా ఎకరాకు రూ.8వేల చొప్పున ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని పొందాలనుకునే రైతులు పంట వేసిన వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ పంట వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.
అనంతరం ఆ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన పిమ్మటే సబ్సిడీ వర్తింపజేయబడుతుందని తెలిపారు. ఈ సబ్సిడీ ఒక రైతుకు కనీసం 1 ఎకరం నుంచి గరిష్ఠంగా 5 ఎకరాల వరకే వర్తిస్తుందన్నారు. దరఖాస్తు కోసం పట్టాదారు పాస్‌బుక్ , ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వారంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిల్వ గోదాములపై అదనపు సబ్సిడీ ఉల్లి ఉత్పత్తికి తోడుగా నిల్వ గోదాముల నిర్మాణం కోసం కూడా సబ్సిడీ అందుబాటులో ఉంటుందన్నారు. 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గల నిల్వ గోదాం నిర్మాణానికి యూనిట్‌కు రూ.1,25,000 సబ్సిడీ (50%) అందించబడుతోందని, రైతులు దీన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.