తాండూరు : వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరులోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని తాం డూరు, యాలాల, పెద్దేముల్ మండలాల బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
భూగర్భజలాలు అడుగంటి చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ పాలనపై ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారని.. మళ్లీ కేసీఆర్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారకుండా కష్టకాలంలో ప్రజలకు తోడుండి బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే సభకు తాండూరు నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యాలాల మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, తాండూరు మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు రమేశ్, శకుంతల, ఉమాశంకర్ తదితరులు ఉన్నారు.