చేవెళ్ల రూరల్, డిసెంబర్ 2 : అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఎందరో తమ కుటుంబాలను కోల్పోతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు మేకల లక్ష్మారెడ్డి, భాగ్యలక్ష్మి చేవెళ్ల మండల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సబితారెడ్డి సోమవారం ప్రొద్దటూరు గ్రామానికి వెళ్లి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, టెండర్ పూర్తై ఒకటిన్నర సంవత్సరాలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. అనునిత్యం ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ మృత్యువాతపడుతున్నారని అన్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోయాయని, రాజకీయాలు పకన పెట్టి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతానికి చెట్లు లేని చోట ముందుగా రోడ్డు పనులు ప్రారంభిస్తే కొంత మేరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పనులను ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి, శంకర్పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.