Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, మే 23 : ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు. ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామం నుంచి తుర్కగూడ, కప్పాడు గ్రామాల మీదుగా కందుకూరు మండలంలోని రాచులూరు వరకు 18కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును డబుల్రోడ్డుగా ఏర్పాటు చేయటం కోసం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించారు.
ఈ పనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పనులు ముందుకు సాగటంలేదు.ముఖ్యంగా ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వి వదిలేశారు. ఈ రోడ్డు వెంట ప్రయాణించే తుర్కగూడ, చర్లపటేల్గూడ, కప్పాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో ప్రయాణించేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఈ రోడ్డు పనులు చేపట్టేందుకు చొరువ చూపించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. నత్తనడకన సాగుతున్న ఈ రోడ్డు పనులతో గ్రామీణ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. నత్తకడనక సాగుతున్న ఈ రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తిచేయించాలని గ్రామీణప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయించాలి : బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్
చర్లపటేల్గూడ గ్రామం నుంచి తుర్కగూడ, కప్పాడు గ్రామాల మీదుగా కందుకూరు మండలంలోని రాచులూరు వరకు చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేయించాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తిచేయించాలి.
నత్తకడకన సాగుతున్న పనులు : ఏనుగు బుచ్చిరెడ్డి, తుర్కగూడ
ఈ రోడ్డు పనులు గత రెండు నెలలుగా చేపడుతున్నారు. కాంట్రాక్టర్, అదికారులు పట్టించుకోకపోవటంతో ఈ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా గోతులు తీసి వదిలేశారు. పనులు త్వరితగతిన చేపట్టాల్సినప్పటికి నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు చొరువచూపి వెంటనే రోడ్డు పనులు పూర్తిచేయించాలి.