రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాత అయోమ యం అవుతున్నాడు. వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగును ప్రారంభించాడు. ఈ సీజన్లో సాగు చేసే వరి, పత్తి తదితర పంటలకు కాంప్లెక్స్ ఎరువులు తప్పనిసరి. ఈ తరుణంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలను ప్రభుత్వం భారీగా పెంచి రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. మరోవైపు ఎరువుల వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న వంటి పం టలకు ఎకరాకు ఒకటి నుంచి రెండు బస్తాల వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిందే. గ్రోమోర్, యూరియా యథాతథంగా ఉన్నా కాంప్లెక్స్ ఎరువులపై రూ.300-రూ. 550 వరకు పెంచారు. క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్ వ్యాపారులపై వ్యవసాయాధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
20-20-013 రకం కాంప్లెక్స్ ఎరువుల బస్తా పాత ధర రూ.1,450 ఉండగా, ఇటీవల ధర పెరగడంతో ప్రస్తుతం రూ.2,150 చేరింది. మరోవైపు గత యా సంగిలో కొని నిల్వ చేసిన కాంప్లెక్స్ ధరల బస్తాలపై పాత ధరలే ఉన్నా.. డీలర్లు, ఫర్టిలైజర్ వ్యాపారులు వాటిని కొత్త ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుం టూ.. అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో పాత ధర ఉన్న బస్తాలను పెంచిన ధరలకే విక్రయిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి.
షాద్‌నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, యాచారం, మంచాల మండలాల్లో వరికి సమానంగా పత్తిపంటనూ సాగుచేస్తున్నారు. వర్షాలు పడటంతో పత్తి విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలతోపాటు కాంప్లెక్స్ ఎరువులను కలపాల్సి రావటంతో రైతులు పెంచిన ధరలకే ఎరువులను కొంటున్నారు. మరోవైపు షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు.
ఈ వానకాలంలో సుమారు 1,60,000 ఎకరాల్లో వరి, 1,00,000 ఎకరాల్లో పత్తి, మరో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యే అవకాశాలున్నట్టు వ్యవసాయాధికారులు అంచ నా వేస్తున్నారు. పంటలు ఏపుగా పెరిగేందుకు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం తప్పనిసరి.
ఎరువులను యాప్ ద్వారా బుక్చేసుకోవాలని ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. యాప్ వినియోగంపై గ్రామీణ ప్రాంత రైతులకు సరైన అవగాహన లేకపోవటంతో వారు బ్లాక్మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువులను కొనాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా యాప్ వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించటంలో వ్యవసాయాధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మాత్రం మధ్యదళారుల ప్రమేయం లేకుండా నేరుగా యాప్ ద్వారా రైతులకు ఎరువులను అందిస్తామని చెబుతున్నా యాప్ వినియోగంపై రైతులు ఆపసోపాలు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఎరువుల ధరలను నియంత్రించటంలో అధికారులు విఫలమవుతున్నారని రైతు లు ఆరోపిస్తున్నారు. ఎరువుల డీలర్లు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నా..వాటి నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయకపోవటంతో మండిపడుతున్నారు. డీలర్లు పాత స్టాక్‌ను పెంచిన ధరకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.