పరిగి, ఏప్రిల్ 21 : శనివారం సాయంత్రం వడగండ్ల వాన, ఈదురుగాలులతో పరిగి మండలం ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ పెద్దతండా పరిధిలో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు సైతం నేల రాలాయి. ఈ రెండు గ్రామాల పరిధిలో 100 ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో తాము కోలుకునే పరిస్థితి లేదని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
వడగండ్ల వర్షానికి తీవ్రంగా పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.25వేలు సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ పెద్దతండాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి నుంచే జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడి వడగండ్ల వర్షానికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగిందని, వెంటనే నష్టపోయిన పంటలను అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించినవారిలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మాజీ సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
– మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి