రంగారెడ్డి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రభు త్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అధికారులు ప్రతినెలా రూ. లక్షల్లో వేతనాలు పొందుతున్నా లంచం తీసుకొనిదే పనులు చేయడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా అవినీతి అధికారుల తీరు మారకపోవడం దారుణం. జిల్లాలోని రిజిస్ట్రేషన్, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి అధికంగా పెరిగింది.
ఇప్పటికే సుమారు పదిహేను మంది అధికారుల వరకు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. పట్టుబడిన వారిలో తహసీల్దార్లు, సబ్రిజిస్ట్రార్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులున్నారు. తాజాగా గురువారం ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో ల్యాండ్ రికార్డుల ఏడీ శ్రీనివాస్ అవినీతి చిట్టా చూసి ఏసీబీ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆయన రూ. వంద కోట్లకు పైగా ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు.
కీలక పోస్టుల కోసం
జిల్లాలో కీలకమైన శాఖల్లో పోస్టింగ్ కోసం అధికారులు రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ కోసం అధికారులు ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్ల కోసం రూ. లక్షలు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. తహసీల్దార్లుగా, ఆర్డీవోలుగా, సబ్రిజిస్ట్రార్లుగా, మున్సిపల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులుగా పోస్టింగ్‌లు పొందేందుకు డబ్బులు పెద్ద ఎత్తున చెల్లిస్తున్నారని.. పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆ డబ్బును రికవరీ చేసుకునేందుకు అవినీతికి తెరలేపుతున్నారని.. ప్రతి పనికి ఇంత ఇవ్వాలని రేట్‌ను ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డబ్బులిస్తేనే పనులు చేస్తున్నారని.. డబ్బులివ్వని వారు ఫైళ్లను వివిధ కొర్రీలు పెట్టి ఆపుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయానికెళ్లినా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అవినీతి పేట్రేగిపోతున్నది. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు, ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులు, నలుగురు సబ్రిజిస్ట్రార్లు, ముగ్గురు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా జిల్లా రెవెన్యూ రికార్డుల విభాగం ఏడీ శ్రీనివాస్ కూడా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో జిల్లాలో అవినీతి అధికారుల తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.