వికారాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారని, సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్‌కు ధాన్యం కొనే ధ్యాసే లేదు. రోజుల తరబడి కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్లాలపై పడుకొని రైతులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదన్నారు.
గన్నీ బ్యాగులు, హమాలీలు లేకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని పండించిన అన్నదాతలు ఎదురుచూస్తున్నారన్నారు. మొన్న సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్తే తరుగు పేరిట క్వింటాలుకు 13 కిలోలను తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ రెండేండ్లలో రైతులు రోడ్లపై ఉండి ధాన్యాన్ని కొనాలంటూ పడిగాపులు పడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ హయాంలో గ్రామాల్లోనే కల్లాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇప్పుడు అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడుస్తున్నదని.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు మొరపెట్టుకుంటున్నా కాంగ్రెస్ సర్కారుకు చలనం లేదని సబితారెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యాన్ని కేంద్రం తీసుకొకపోతే ఢిల్లీలో ధర్నా చేశామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ సర్కారు హయాంలో మూడో పంటకు రైతు బంధు సాయం అడిగిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం రెండు పంటలకు అర్హులైన వారందరికీ రైతుబంధు సాయం అందజేయలేదన్నారు. మార్పు మార్పు అంటూ రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు.
శాంతిభద్రతలు సరిగ్గాలేవు
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గాలేవని, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి, పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగొచ్చినా రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా, పక్క రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు క్యూ కడితే, ప్రస్తుతం పెట్టుబడుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లుండే, ఇప్పుడెట్లుందో అందరికీ తెలుసు. రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందన్నారు. ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీని ఎలా నిర్మిస్తారని హరీశ్‌రావు నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారన్నారు.
ప్రతీ ఇంటిని టచ్ చేయాలి
ప్రతీ ఇంటిని టచ్ చేసి, పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదుతోపాటు ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బూత్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని, ప్రతీ బూత్‌లో ఉండే ఇద్దరు బూత్ ఇన్చార్జీలు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ బూత్ కమిటీలో మహిళలు, యువకులను నియమించేలా చూసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదులో ఫొటో కూడా తీసుకోవాలని, న్యూట్రల్‌గా ఉన్న వారి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం కల్పించాలన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే కమిటీలో చోటు కల్పించాలన్నారు.
పార్టీకి నష్టం చేస్తే కన్నతల్లికి నష్టం చేసినట్టేనని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, రాబోయే ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీ గెలిచేలా కష్టపడాలన్నారు. కేసీఆర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఏదో రకంగా లబ్ధి పొందిందని, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ సర్కారు హయాంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా పేద ప్రజలకు అందజేశారని, భవిష్యత్తులో నాయకుల ద్వారానే అందేలా అధిష్ఠానం దృష్టికి తీసుకుపోతామన్నారు.
నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం వికారాబాద్ నియోజకవర్గంలోనే చేసేలా చూస్తామన్నారు. వడ్లను కొనాల్సిన కేంద్రం కొనకుండా ధర్నాలు, బస్సు యాత్రలు చేస్తున్నదని, బస్సు యాత్రలు తెలంగాణలో కాదు, ఢిల్లీలో చేయాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఏనాడూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, బీజేపీ పొలిటికల్ డ్రామాను ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలని లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఎన్డీఏ ప్రభుత్వం కోటి ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మెన్ విజయ్‌కుమార్, కౌన్సిలర్ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులున్నారు.
ప్రజా సమస్యలు గాలికి..
ప్రజా సమస్యలను రేవంత్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందజేయగా, ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నదని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ సీఎం పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి జిల్లాకు సాగునీరిచ్చే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కేసీఆర్ సీఎంగా ఉంటే ఈపాటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరు వచ్చేదన్నారు. ఎప్పుడు ఏ ధరలు పెంచుతారోనని ప్రజలు ఆందోళన పడుతున్నారని, గత పదిహేను రోజుల్లో రోజుకు రూ.2ల చొప్పున పెట్రోల్, డిజీల్ ధరలను, ఎరువుల ధరలను కేంద్రం పెంచిదన్నారు.
రైతు గోసకు బాధ్యత కాంగ్రెస్, బీజేపీలే..
ప్రస్తుతం రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యత అని, హంతకులే సంతాప సభ పెట్టినట్లుగా కాంగ్రెస్, బీజేపీల తీరు ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లు నాటకాలు ఆడుతున్నాయి. ఈ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, రైతులను గోస పెట్టే భరోసాను బీజేపీ ఇస్తున్నది. కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే సాగునీరందిస్తామని సీఎం అంటున్నారు. మిగతా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు సాగు నీరందించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తాం. మూడు నియోజకవర్గాలకు అన్యాయం చేస్తే జిల్లాలో సీఎంను తిరుగబోనివ్వం. నియోజకవర్గానికి ఇచ్చిన టార్గెట్ ప్రకారం సభ్యత్వ నమోదును పూర్తి చేస్తాం. పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ పదవులతోపాటు న్యాయం జరిగేలా చూస్తాం.
– వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నియోజకవర్గానికి లక్ష సభ్యత్వం చేయాలి
నియోజకవర్గానికి లక్ష వరకు పార్టీ సభ్యత్వం చేసేలా చూడాలి. క్రియాశీలక సభ్యత్వానికి రూ.50, సాధారణ సభ్యత్వానికి రూ.10గా పార్టీ నిర్ణయించింది. సభ్యత్వం ఉంటేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి, పెద్దఎత్తున సభ్యత్వ నమోదు అయ్యేలా చూస్తాం. ప్రతీ బూత్‌కు ఇద్దరిని ఎంపిక చేసి సభ్యత్వ నమోదు చేయిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.
– గట్టు రామచంద్రారావు, వికారాబాద్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి