షాబాద్, మే 23 : ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందితే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరిట ప్రభుత్వమే రూ.3,556 ప్రీమియం చెల్లిం చింది. రైతు చనిపోతే వారం, పది రోజుల్లో నామినీ ఖాతాలో రూ.5లక్షల బీమా డబ్బులు జమ అయ్యే వి. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా డబ్బు లు అందడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 117 మంది రైతులు చనిపోగా.. వారికి ఇప్పటికీ బీమా డబ్బులు అందలేదు. ఏమైందని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే తమ వద్ద ఏమి పెండింగ్‌లో లేవని.. మీ డాక్యుమెంట్లను ఉన్నతాధికారులకు పంపించామని చెబుతున్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 117 మంది రైతులు వివిధ కారణాల తో మృతిచెందారు. బీమాకు సంబంధించిన పత్రాలకు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు అందజేశారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రైతులకు బీమా డబ్బులు రావడమే లేదు. ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం సరిపడా చెల్లించకపోవడంతోనే రైతు బీమా డబ్బులు నిలి
పోయినట్లు తెలుస్తుంది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకున్న చర్యలను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అదునుకు ముందే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడంతోపాటు రైతు చనిపోతే వారం రోజుల్లోనే బాధిత కుటుంబానికి బీమా డబ్బులు అందేలా చర్యలు తీసుకున్నారు. కరెంట్, నీళ్లు తదితర విషయాల్లో రైతులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నదాతలు జ్ఞప్తి చేసుకుంటున్నారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే.. బాధిత కుటుంబం రోడ్డున పడొద్దనే సదుద్దేశంతో 2018 ఆగస్టు 15న రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి 2023 ఆగస్టు 15 వరకు ప్రతి ఏడాది అన్నదాత పేరిట ఆగస్టు 15లోపు రూ.3,556 ప్రీమియం డబ్బులు చెల్లించి రైతు పేరిట బీమాను రెన్యువల్ చేయించేవారు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్నదాతకు మేలు జరిగిందని అన్నదాతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతను మోసం చేస్తూనే ఉన్నది. రైతుభరోసా, రుణమాఫీ, రైతుబీమా వంటి పథకాలు సకాలంలో అందించక రైతన్నను ఆగం చేస్తున్నది. రుణమాణీ సగమందికే చేసిన ప్రభుత్వం, రైతుభరోసా కూడా అంతంతా మాత్రంగానే చేసి చేతులు దులుపుకొన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం కల్పించి ఆదుకున్నది. ఆ బీమా పథకాన్ని కూడా రేవంత్ సర్కార్ సక్రమంగా అమలు చేయకపోవడం చాలా దారుణం.
-గంగిడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, హైతాబాద్, షాబాద్ మండలం
రైతు బీమా డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం తో వివిధ కారణాలతో రైతులు మృతిచెందితే, ఆ రైతు కుటుంబాలకు బీమా డబ్బులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నదాత బాగు కోసమే గత కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్ మాత్రం రైతన్నను పట్టించుకోకపోవడం దారుణం. పెండింగ్‌లో ఉన్న బీమా డబ్బులను చెల్లించి రైతు కుటుంబాలను ఆదుకోవాలి.
-కుమార్, రైతు కుమ్మరిగూడ, షాబాద్ మండలం
రేవంత్ సర్కార్ బీమా ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం దారుణం. అన్నదాతల బాగుకోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. రైతుల పేరిట ప్రతి ఏడాది ఆగస్టులోనే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి అన్నదాతకు రూ.5 లక్షల బీమా కల్పించింది. రైతు చనిపోతే వారం, పది రోజుల్లో నామినీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి.
-చెన్నయ్య, రైతు బోడంపహాడ్, షాబాద్