యాచారం, ఏప్రిల్ 29: ‘ఫ్యూచర్‌సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉంది. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉన్నది. ఫ్యూచర్‌సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకొని కొంచెం దూరంలో స్థలాలు కొనుకోవచ్చు’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్న మాటలివి. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ప్రసంగించిన ఆయన ఫార్మాసిటీ రైతులను పూర్తిగా విస్మరించారు. ఫ్యూచర్‌సిటీ సాక్షిగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి బుధవారం తీవ్రంగా ఖండించారు.
ఆయన రైతులపై అక్కసు వెళ్లగక్కడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో రైతులు తమ భూములను ఎవరికీ ఇవ్వొద్దని చెప్పిన ఆయనే నేడు డబ్బులు తీసుకొని దూరంగా భూములు కొనుక్కోవాలని సూచించడం ఎంతో బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి ఎవరూ భూములు ఇవ్వొద్దని సూచించిన రేవంత్‌రెడ్డి నేడు సీఎం కుర్చిలో కూర్చోగానే రైతులను పూర్తిగా విస్మరించడం తగదన్నారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 19,000 ఎకరాలు సేకరిస్తే నేటి కాంగ్రెస్ ప్రభు త్వం ఫ్యూచర్సిటీకోసం 30,000 ఎకరాలను సేకరించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదండరాం, కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి రైతులతో కలిసి పాదయాత్ర చేసి, తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, మీ భూములను మీకే ఇస్తామని హామీఇచ్చి.. గద్దెనెక్కాక ఫ్యూచర్‌సిటీకి భూములివ్వాలని రైతులను బెదిరించడం ఎంతవరకు న్యాయమన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను తీసుకోవద్దని, రేడియల్ రోడ్డును రద్దు చేయాలని గత 47 రోజులుగా గిరిజన రైతులు రిలే దీక్షలు చేస్తుంటే సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఫ్యూచర్‌సిటీకి కాంగ్రెస్ నాయకులు తమ భూములను ఇవ్వాలని, పార్టీ కోసం త్యాగం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ భూ బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు.