సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆటో డ్రైవర్ల అసెంబ్లీని ముట్టడి కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆటో డ్రైవర్లు హిమాయత్‌నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి బయలుదేరగా, అసెంబ్లీకి సమీపంలోని పెట్రోల్ బంక్ సిగ్నల్పాయింట్కు వెళ్లే మార్గంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అంతేకాకుండా రాష్ట్రం నలువైపుల నుంచి నగరానికి చేరుకుంటున్న వందలాది మంది ఆటో డ్రైవర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు మారయ్య, వెంకటేశ్, సత్తిరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఉపాధి అంతా సర్వ నాశనమైపోయిందని, రేవంత్ సర్కార్ ఆటోడ్రైవర్ల జీవితాలను సర్వనాశనం చేసిందన్నారు. ఉచిత బస్సు స్కీం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం ఆటో డ్రైవర్ల సమస్యలు వినడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని వాపోయారు. చర్చలకు పిలుస్తామని మాటిచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆటో డ్రైవర్ల ఉద్యమం ఆగదని.. హామీలన్నీ నెరవేరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సిటీ ఆటో యూనియన్, టీఎస్డీయూ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.