రంగారెడ్డి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని శివారు ప్రాంతాల్లో రిసార్టులు మందు, మగువలతో బిజీగా కొనసాగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న రిసార్టులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. రెసిడెన్షియల్ భవన నిర్మాణ అనుమతులు తీసుకుని వాటిని రిసార్టులుగా మారుస్తున్నారు. రాత్రిపూట రంగురంగుల విద్యుత్‌దీపాలతో కండ్లు జిగేల్ మనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిసార్టుల్లో రోజుకు రూ.50,000-రూ.1,00,000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు.
అటు అధికారులు కన్నెత్తి చూడకపోవడం తో వాటిలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే ఆరోపణలున్నాయి. శివారు ప్రాంతాల్లో రిసార్టుల కల్చర్ పెరిగిపోతున్నది. గతంలో జిల్లాలో వందలోపే ఉన్న రిసార్టులు ప్రస్తుతం వెయ్యికి మించిపోయాయి. వీటిలో వారాంతరాల్లో రేవ్పార్టీలను నిర్వహిస్తున్నారు. కొందరు పెండ్లిళ్లు, డిన్నర్ల పేరుతో బుక్‌చేసుకుని రాత్రిపూట అక్కడ పేకాట.. మరి కొన్నిచోట్ల పలు కంపెనీలు పార్టీలను ఏర్పాటు చేసి కస్టమర్లను ఆహ్వానించి వారికి మందు, మగువను అందుబాటులో ఉంచుతు న్నారనే ఆరోపణలున్నాయి. రాత్రివేళల్లో డీజే సౌండ్ మోతతో మహిళలు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్నారని.. తమకు సౌండ్ మోతతో నిద్రపడడంలేదని చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నా.. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.
డీజేల సౌండ్‌తో హోరెత్తిస్తూ..
జిల్లాలో నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకుని రిసార్టులను నిర్మి స్తున్నారనే ఆరోపణలున్నాయి. మంచాల మండలంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ప్రతిరోజూ రాత్రివేళల్లో డీజేలు సౌండ్స్‌తో హోరెత్తిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వెయ్యికిపైగానే..
జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచా రం, మంచాల, కందుకూరు, మహేశ్వరం, శంషాబా ద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, గండిపేట, మొయినాబాద్, చేవెళ్ల, నార్సింగ్ వంటి ప్రాంతాల్లో దాదాపుగా వెయ్యికిపైగా రిసార్టులను ఏర్పాటుచేశారు. వీటికి రెసిడెన్షియల్ భవన నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్వాహకులు రిసార్టులుగా మార్చి కమర్షియల్ దందా చేస్తున్నారు. రిసార్టుల్లో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రేవ్ పార్టీలు..
జిల్లాలో ఇటీవల నిర్వహించిన రేవ్పార్టీలను పోలీసులు భగ్నంచేశారు. గత మంగళవారం రాత్రి మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి గ్రామం లోని ఓ రిసార్టులో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన రేవ్‌పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నంచేశారు. ఇందులో మహిళలు మద్యం తాగి యువతతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. విశ్వసనీయ సమాచా రం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి చేసి పలువురు యువకులు, మహిళలను అదుపులోకి తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు.
అలాగే, ఈ ఘటన మరిచిపోకముందే మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న సప్తగిరి అనే ఓ వ్యక్తికి సంబంధించిన రిసార్టులో బుధవారం రాత్రి కిట్టీపార్టీ పేరుతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు అక్కడికెళ్లగా అందు లో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా మద్యం మత్తులో ఉన్నారు. ఘటనాస్థలంలోని బీర్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 25 మందిపై మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో మొయినాబాద్, చేవెళ్ల మండలాల పరిధుల్లోని పలు రిసార్టుల్లోనూ రేవ్ పార్టీలను నిర్వహించగా పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీల్లో గంజాయి మూలాలను అధికారులు బయటపెట్టారు.
వీకెండ్స్‌లో బిజీగా ..
నగరంలో యాంత్రీక జీవితం గడుపుతున్న అనేక మంది వీకెండ్స్‌లో శివారుల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లకు వెళ్లి హాయిగా గడపాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే రిసార్టులను బుక్‌చేసుకుని అందులో రెండు రోజుల పాటు గడుపుతున్నారు. కొందరు బంధువులతో, మరికొందరు స్నేహితులతో కలిసి రిసార్టుల్లో చిందులేస్తున్నారు. కొందరు కిట్టీ పార్టీల పేరుతో మహిళలను తీసుకొచ్చి పేకాటతోపాటు మద్యం తాగుతూ మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్నారు. అదేవిధంగా పలు రిసార్టుల్లో గంజాయి, డ్రగ్స్ యథేచ్ఛగా లభిస్తున్నాయనే ఆరోపణలున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ రిసార్టుల్లో పుట్టి రోజు వేడుకలు, ప్రెషర్స్‌డే వంటి కార్యక్రమాలను నిర్వహించి గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటున్నా రని.. ఇటీవల రిసార్టులపై పోలీసులు జరిపిన దాడుల్లో తేలింది.