వికారాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వైల్డర్నెస్ రిసార్ట్ యథావిధిగా కొనసాగుతున్నది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటు బోల్తాపడి ఇద్దరు పర్యాటకులు మృతిచెందిన ఘటన తర్వాత జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు లేని వైల్డర్నెస్ రిసార్ట్‌పై చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారుల ద్వారా నోటీసులు అందజేయడంతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ తదితర ఏడు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వహించే భూమి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ తదితర పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. బోటు బోల్తాపడి ఇద్దరు మహిళా పర్యాటకులు మృతిచెందిన ఘటనలో వైల్డర్నెస్ రిసార్ట్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇల్లీగల్‌గా రిసార్ట్ నిర్వహిస్తున్నప్పటికీ కేవలం ఇద్దరు పర్యాటకులు మృతి చెందిన కేసును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు తప్ప ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రిసార్ట్‌పై మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే దానిపై అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన అనంతరం వారం రోజులపాటు రిసార్ట్‌ను మూసివేయగా, తదనంతరం యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండానే రిసార్ట్‌ను నిర్వహిస్తూ పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రిసార్ట్‌ను ఎందుకు మూసివేయలేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడు శాఖల అధికారులతో వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏముంది, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. అసైన్డ్ భూమిలో పేదలు వంద గజాలలోపు ఇల్లు నిర్మించుకుంటే నిర్దాక్షిణంగా కూల్చివేసే అధికారులు ఏకంగా అసైన్డ్ భూముల్లో రిసార్ట్ నిర్వహిస్తున్న రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనంతగిరి హిల్స్ చుట్టూ ఉన్న రిసార్ట్‌లకు నోటీసులు ఇచ్చి పదిహేను రోజులపాటు మూసివేసి హల్చల్ చేసిన జిల్లా పంచాయతీ అధికారులు ఆ తర్వాత ఎందుకు స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. కొద్దిరోజులు హల్చల్ చేయడం మళ్లీ పట్టించుకోకపోవడం చూస్తుంటే ముడుపుల కోసమేననే ప్రచారం జరుగుతున్నది. నిజాయతీ అధికారిగా పేరొందిన కలెక్టర్ అనుమతుల్లేని రిసార్ట్‌లపై చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు ఏమైనా తలొగ్గుతున్నారా అనే ప్రచారం జరుగుతున్నది.
అనుమతుల్లేకుండానే నిర్వహణ
సేఫ్టీ జాకెట్స్, ట్యూబ్స్ లేకుండానే సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌కు తీసుకెళ్లిన వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు ఇద్దరు మహిళల నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను కబ్జా చేశారని వింటుంటాం కానీ సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు ఏకంగా చెరువులనే కబ్జా చేసి అక్రమంగా దోచుకుంటున్నారు. చెరువులోనే రిసార్ట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండానే బోటింగ్ నిర్వహిస్తుండటంతోపాటు ప్రాజెక్టు మధ్యలో ప్రత్యేకంగా రూంలను ఏర్పాటు చేశారు. నిబంధనలను పట్టించుకోకుండా, సేఫ్టీ చర్యలు పాటించకుండానే బోటింగ్ నిర్వహణతోపాటు చెరువు మధ్యలో రూంలను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు.
ఏడాది క్రితం ఎలాంటి అనుమతులు లేవంటూ వైల్డర్నెస్ రిసార్ట్‌తోపాటు పలు రిసార్ట్‌లను మూసివేసిన అధికారులు, ముడుపులు అందిన వెంటనే వారే దగ్గరుండి తెరిపించారని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా చెరువులోనే నాలుగు ప్రత్యేకంగా రూంలు ఏర్పాటు చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు, స్థానికుల ఫిర్యాదులతో చెరువులో ఏర్పాటు చేసిన ఒక రూంను ఏడాది క్రితం సీజ్ చేసిన ఇరిగేషన్ అధికారులు చేతులు దులుపుకొన్నారు. తదనంతరం అటువైపు చూడకపోవడం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు సీజ్ చేసిన రూంతోపాటు ప్రాజెక్టు మధ్యలో ఉన్న రూంలను గతేడాదిగా నిర్వహిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసే నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్పన్‌పల్లి చెరువు చుట్టుపక్కల ఎఫ్టీఎల్, బపర్ జోన్ కబ్జా జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఎఫ్టీఎల్, బపర్జోన్ పరిధికి రాదంటూ ఆక్రమణదారులకు అధికారులు వత్తాసు పలుకుతుండడం గమనార్హం.