షాబాద్, జూలై 11 : పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర్నా చేపట్టారు. నిందితుడిని పట్టుకుని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసు విషయంలో నిర్లక్ష్యం చేసిన సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐ డౌన్‌డౌన్…సీఐ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు.
17 ఏండ్ల బాలికను దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్ వేధించడంతో ఆ బాలిక కుటుంబీకులు మే 16న షాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్ గతేడాదిగా తమను ఎలా వేధిస్తున్నాడో పోలీసులకు వివరించినా వారు కేసు నమోదు చేసి పక్కన పెట్టేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. దీంతో నిందితుడు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. తాను వెంటపడుతున్నా లొంగకపోవడంతో పాటు తనపైనే పోలీసులకు ఫిర్యా దు చేస్తావా అంటూ బాలికపై కోపం పెంచుకున్నాడు.

శుక్రవారం రాత్రి రాజ్‌కుమార్ బాలిక ఇంటికి బీర్ బాటిల్‌తో వెళ్లి తలుపు తట్టాడు. డోర్ తీసిన బాలిక తల్లి లక్ష్మిని కత్తితో పొడిచాడు. అలాగే పడుకున్న బాలిక నానమ్మ రుక్కమ్మను గొంతుకోసి హతమార్చాడు. బాలికను నిర్బంధించి గోడపై నుంచి బయటికి పడేసి ఇంటి వెనుక పార్కు చేసిన తన కారులో ఆ బాలికన దైవాలగూడ వైపు తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో అఖిల్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి బాలిక గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు కాగానే.. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి ఉంటే..
ఇంత జరిగేది కాదని, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆరుగురు హత్యకు గురయ్యారని మృతుల బంధువులు, ప్రజలు మండిపడ్డారు. కేసు విషయంలో పలుమార్లు పోలీసులను కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ధర్నా చేస్తు న్న మృతుల కుటుంబానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆంజనేయులు సంఘీభావం తెలిపి ధర్నాలో కూర్చున్నారు. ధర్నా స్థలికి ప్యూచర్‌సిటీ కమిషనర్ తరుణ్‌జోషి, డీసీపీ యోగేశ్‌గౌతమ్ వచ్చి వారిని ఎంత సముదాయించినా వినలేదు.