Shamshabad | శంషాబాద్ రూరల్, మార్చి 4 : ఎర్రచందనం ఎలా ఖరీదైన వస్తువువో ఆదే స్థాయిలో ఎర్రమట్టి ఖరీదైనది కావడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. కొంతకాలం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తు అక్రమ దందాను యాధేచ్చగా చేపడుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మట్టి తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులు అధికారులకు చిక్కకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టికి కొదవలేదు. దీంతో ఆదే అదనుగా భావించిన అక్రమార్కులు వారి అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి రెవెన్యూలోని 19 సర్వే నంబర్, నర్కూడ 193, 214 సర్వే నంబర్లు, చౌదర్‌గూడ 220, 221 సర్వే నంబర్లు, పెద్దషాపూర్ 2,3,4,71,79 సర్వే నంబర్లు, మల్కారం 84,86 సర్వే నంబర్లు, రాయన్నగూడ, కాచారం, జూకల్ గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
అక్రమార్కులు రాత్రి సమయంలో మట్టితవ్వకాలు నిర్వహించి మండలం నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకుపోయి మట్టిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు కిందిస్థాయి అధికారులు మట్టి వ్యాపారులకు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాలంగా మట్టిమాఫియా పెరిగిపోయిందని ఆయా గ్రామాల ప్రజలు వివరిస్తున్నారు. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న అక్రమార్కులు మాత్రం రాత్రి సయమంలో మట్టిని దోచుకుపోతుండడంతో అధికారులకు చిక్కడంలేదని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా జనవరి నెల నుంచి మట్టిమాఫియా మండలంలో వారి కార్యకలాపాలను జోరుగా కోనసాగిస్తున్నారు. ఎర్రమట్టికి మార్కేట్లో మంచి డిమాండ్ ఉండడంతో రాత్రి సమయంలోనే మట్టిని తవ్వి దోచుకుంటున్నారు. ఇప్పటికైన సంబంధిత అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూముల్లో మట్టితవ్వకాలపై చర్యలు తీసుకుంటాం : శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్
శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అక్రమార్కులు రాత్రి సమయంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిపై చర్యలు తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నం. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేశాము. మిగిత వారిపై చర్యలు తీసుకోవడం కోసం పోలీసుల సహకారం కోసం విన్నవించిన్నట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములను కాపాడుతాం అని తహసీల్దార్ చెప్పారు.