రోజురోజుకూ ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఒకవైపు ఠారెత్తించే ఎండలు, మరోవైపు తట్టుకోలేని వేడిమితో కూడిన వడగాలులు, ఇంకోవైపు భరించలేనంతగా ఉక్కపోత అన్ని వెరిసి వేసవిలో ఎండా వేడిమితో ప్రజలు నిత్యం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పట్టుమని పది కాకముందే సూర్యడు భగ్గున మండిపోతున్నాడు. మండలంలో 36నుంచి సుమారు 40డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక రోజువారి కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు, చిన్న పిల్లలు, వృద్ధులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా ఎండవేడిమికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. తగిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని మండల వైద్యాధికారులు చెబుతున్నారు.
-ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్/ యాచారం, మార్చి31
ఎండదెబ్బకు గురైన వారి శరీరం వేడిగా ఉండి చెమట పట్టదు. చర్మం వేడిగా, పొడిగా మారి ఎర్రబడుతుంది. విపరీతమైన తలనొప్పి, తల తిరుగుడు, కండ్లు తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు బాదిస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. అలసట, నిసత్తువ నెలకొంటుంది. చిరాకు, కంగారు, అపస్మారక స్థితితో ఇబ్బందులెదుర్కొంటారు. గుండెపోటు, వాంతులు, చర్మ సమస్యలు, కండ్ల మంటలు, జుట్టు సమస్యలు సంభవిస్తాయి. వడదెబ్బ తగిలిన వారికి శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోతుంది. నాడీ వేగంగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఎండదెబ్బ సోకినవారు పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకోవడం. నాలుక తడి ఆరిపోవడం వంటి లక్షణాలుగా గుర్తించవచ్చు.
మొదటగా చిన్నపిల్లలు, వృద్ధులు, స్థూలకాయులు, గర్భిణులు, గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నవారు, మద్యపానియాలు సేవించేవారు, కొన్ని రకాల మందులు నిత్యం వేసుకునేవారికి వడదెబ్బ అధికంగా సంభవిస్తుంది.
ఎండదెబ్బకు గురైన వ్యక్తికి సత్వరమే ప్రథమ చికిత్స చేయాలి. చికిత్సలో ఆలస్యమైతే శరీర అవయవాలు దెబ్బతినడంతో పాటు ప్రాణాపాయస్థితి నెలకొనె అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన వారిని శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వెంటనే నీడకు చేర్చాలి. చల్లటి గుడ్డతో శరీరాన్ని తూడ్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకొచ్చేలా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం, నిమ్మరసాన్ని తాగించాలి. వీలైనంత త్వరగా దవాఖానాకు తీసుకెళ్లాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండలో పనిచేసేవారు గంటకు తప్పనిసరిగా 5లీటర్ల నీటిని తాగాలి. పుచ్చకాయలు, కొబ్బరిబోండం, తాటి ముంజలు, కర్బూజ, జామ, దోసకాయలు, నిమ్మరసం, పండ్లరసం అధికంగా తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే లవణాలను తిరిగి పొందేందుకు కొబ్బరినీళ్లు, ఉప్పు పంచదారా కలిపిన నీటిని తాగాలి.
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావటానికి జంకుతున్నారు. నాలుగు రోజుల నుంచి నియోజకవర్గంలో సుమారు 40డిగ్రీల ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇండ్లలో నుంచి ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎప్పుడు రద్దీగా ఉండే బస్టాండు సమీపంతో పాటు అంబేద్కర్ చౌరస్తా, రెవెన్యూ కార్యాలయం, స్టేట్‌బ్యాంకు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు ప్రజలు రోడ్లపై లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. ఎండలు తీవ్రంకావటంతో ప్రజలు శీతలపానియాల వైపు పరుగులు పెడుతున్నారు. సాగర్ రహదారికిరువైపులా ఉన్న చిరువ్యాపారస్తులు ఎండల్లోనే గుడారాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. సాయంత్రం ఐదు దాటిన తర్వాతనే ప్రజలు ఇండ్లనుంచి బయటికి వస్తున్నారు.
శీతల పానియాలైన నిమ్మరసం, పండ్ల రసాలకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు శీతలపానియాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.
ఈ ఎండల తీవ్రతకు మనుషులతో పాటు పశువులు కూడా వడదెబ్బ బారీన పడే అవకాశముంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలామస్ అనే భాగం స్వేద గ్రంథుల మీద పర్యవేక్షణ కోల్పోతున్నది. దీనివల్ల అవి చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. చెమటద్వారా శరీరంలో దాతువులు కోల్పోయి జీవక్రియ దెబ్బతింటుంది.
శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడీమండలం, మూత్రపిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారి కోమాలోకి జారుకొని శ్వాస అందక మరణిస్తాయని, దీనికి రైతులు ఎప్పటికప్పుడు పశువులకు ఎలాంటి అపాయం జరగకుండా ఎండలో జాగ్రత్తగా చూసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. మూగజీవాలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించటంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీటిలో శుభ్రం చేయాలని పశువైద్యాధికారి సురేశ్‌బాబు తెలిపారు.
ఎండ తీవ్రత నుంచి పశువులను రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహ వసతిని కల్పించాలి.
షెడ్లో గాలి, వెలుతురు దారాళంగా ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారుగా 12అడుగులు ఉండాలి.
షెడ్డుకు ఇరువైపులా ఉండే పక్క గోడలను పూర్తిగా కట్టకుండా 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు నిర్మించాలి. షెడ్ చుట్టుపక్కలా నీడ ఉండటం కోసం చెట్లను పెంచాలి. వీలైతే షెడ్లో షవర్స్, స్ప్రింక్లర్లను అమర్చి, నీటి తుంపర్లు పశు శరీరంపై పడేలా చేయాలి. పశువుల పాకలో అధిక ఊష్ణోగ్రత ఉంటే తట్టుకోలేవు. వడగాలుల తీవ్రత తగ్గించడానికి, షెడ్డుకిరువైపులా పరదాలు, గోనెసంచులను కట్టి, నీటితో తడపాలి.
పశువులను ఎండ సమయంలో కాకుండా.. కేవలం ఉదయం 6 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు మాత్రమే మేతకు బయటతిప్పాలి. వేసవిలో జీర్ణక్రియ తగ్గుతుంది. కాబట్టి, గంజి, జావా, వంటి పదార్థాలను ఇవ్వడం ఉత్తమం. మేతను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. వరి గడ్డిని జనుముతో కలిపి కూడా మేపవచ్చు. ఉదయం పచ్చిగడ్డి, సాయంత్రం ఎండుగడ్డిని ఇవ్వాలి.
వడదెబ్బకు గురైన పశువును గుర్తించిన వెంటనే నీడ ప్రదేశానికి తరలించి, చల్లని నీటితో పశువు ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత ఐస్‌ను ఓక్లాత్తో చుట్టి, పశువు నుదిటిపై చుట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. పశువు కోలుకునే వరకు కేవలం చాప్కట్చేసిన పచ్చిగడ్డిని మాత్రమే అందించాలి. మినరల్ మిక్షర్, ఉప్పు కలిపిన ద్రావణాలను ఇవ్వాలి.
వేసవిలో ప్రజలను వడదెబ్బ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎండ దెబ్బకు గురైనవారికి సరైన సమయంలో ప్రథమ చికిత్సను అందించాలి. టోపీలు, గొడుగులు, కూలింగ్ అద్దాలు వాడాలి. కాటన్ దుస్తులవులను ధరించాలి. రోజుకు 5లీటర్ల నీళ్లు తాగాలి, నిమ్మరసం, పండ్లరసం, కొబ్బరిబొండాం, పుచ్చకాయలు లాంటి శీతల పానీయాలు తీసుకోవాలి.
– రాజ్యలక్ష్మి, వైద్యాధికారి యాచారం
వేసవి కాలంలో పశువులు ఎండల తీవ్రతకు తట్టుకోవు. ఎండలు విపరీతంగా ఉన్నందున వడదెబ్బకు గురై మృత్యువాత పడే అవకాశమున్నది. రైతులు పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళలో బయటకు వదలాలి. వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
– సురేశ్‌బాబు, పశువైద్యాధికారి