రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయలాంటిది రంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, రేవంత్ సర్కారు వచ్చాక హెచ్ఎండీఏ నిబంధనలు కఠినతరం కావడంతోపాటు హైడ్రా దూకుడు వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైంది. కేసీఆర్ హయాంలో జిల్లాలో నెలకు 18,000-22,000 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ, ఇప్పుడు నెలకు 1,500-1,600 వరకు మాత్రమే అయితున్నాయి. దీంతో గత 11 నెలల్లో జిల్లాకు రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊసేలేకుండా పోయింది.
జిల్లా పరిధిలో ఓ వైపు హెచ్ఎండీఏ, మరో వైపు ట్రిపుల్ఆర్ వంటి ప్రఖ్యాత రహదారులు వస్తున్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం పుంజుకోవడం లేదు. హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఓ కారణం కాగా.. హెచ్ఎండీఏ పరిధిలో వెంచర్ల అనుమతులకు నిబంధనలు కఠినతరం కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గత బీఆర్ఎస్ హయాంలో ఐటీ, ఫాక్స్‌కాన్, కెమ్స్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలు జిల్లాకు రాగా ఈ వ్యాపారం పెద్దఎత్తున ఊపందుకున్నది. ఈ బిజినెస్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంచుకున్న వారు కూడా ఎంతోమంది ఉపాధి పొందారు. కానీ, రేవంత్ సర్కారు వచ్చా క భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అనేక నిబంధనలను తీసుకొచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలో వెంచర్లు చేసేందుకు కూడా అనేక కొర్రీలు పెట్టడంతో అనుమతుల కోసం పెట్టిన దరఖాస్తులు కుప్పలు పేరుకుపోయాయి. మరోవైపు హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెరగడంతో దాని ప్రభావం జిల్లాపైనా పడింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ప్లాట్లు, భూముల విక్రయాలు తగ్గిపోయాయి.
కేసీఆర్ హయాంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. 2023 సెప్టెంబర్‌లో జిల్లాలో 21,000 రిజిస్ట్రేషన్లు కాగా ప్రభుత్వానికి రూ.350 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2024 సెప్టెంబర్‌లో 1,650 రిజిస్ట్రేషన్లు కాగా .. రూ. 220 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నిత్యం రిజిస్ట్రేషన్లతో కళకళలాడే ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, పెద్దఅంబర్‌పేట, ఆమనగల్లు, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నేడు రిజిస్ట్రేషన్లు లేక వెలవెలబోతున్నాయి. అలాగే, ఈ రంగంపై ఆధారపడిన మధ్యవర్తులు, ఇతరులు పూర్తిగా ఉపాధిని కోల్పోయారు.
జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. గండిపేట, శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, షాద్‌నగర్, శేరిలింగంపల్లి, ఫరూఖ్‌నగర్, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల వంటి మండలాలు ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌తో కళకళలాడేవి. కానీ, ప్రస్తుతం హైడ్రా ప్రభావంతో రియల్ వ్యా పారం పూర్తిగా పడిపోయింది. శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొన్నవారంతా అయోమయంలో పడ్డారు. కొనుగోలు, అమ్మకాలు తగ్గిపోయాయి. అదేవిధంగా జిల్లా లోని పలు మండలాల నుంచి ట్రిపుల్ఆర్ వెళ్లడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలు ఉన్నా అక్కడి ప్రాంతాల్లో భూములను కొనేందుకు ప్రజలు అంతగా ఇష్టపడడంలేదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో ఏండ్లుగా ఉన్నా. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ఈ రంగం పూ ర్తిగా అస్తవ్యస్తం కావడంతో దీనిని నమ్ముకున్న నాతోపాటు ఎంతోమంది రోడ్డునపడ్డారు. అప్పులు చేసి ప్లాట్లు, భూములను కొనుగోలు చేశా. ప్రస్తుతం వాటిని కొనేందుకు ఎవరూ రావ డం లేదు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నా.
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకొని రూ. లక్షలు అప్పులుచేసి భూములపై పెట్టుబడి పెట్టా. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో భూములు, ప్లాట్లను కొన్నా. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. చేసిన అప్పులకు మి త్తీలు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. నా 25 ఏండ్ల వ్యాపారంలో ఇంత గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూ డలేదు.