రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మరింత పతనమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. మార్కెట్ విలువల పెంపుతో మరోమారు పతనం అంచులోకి చేరింది.
ముఖ్యంగా జిల్లా పరిధిలో ఇటీవల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాట్ల బేరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 230 కోట్లకు ధర పలికింది. శేరిలింగంపల్లి, ఎస్ఆర్వో రంగారెడ్డి, కోకాపేట్ తదితర రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్కెట్ విలువ పెంపుతో స్టాంప్ డ్యూటీలు గణనీయంగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఈ ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం చేసిన మార్కెట్ విలువల పెంపు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్రంగా చూపింది. గతంలో రియల్ ఎస్టేట్లో రాష్ర్టానికే గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలో నేడు వ్యాపారం పూర్తిగా పడిపోయింది.
భూములు, ప్లాట్ల ధరల మార్కెట్ విలువల పెంపుతో కొనుగోలుదారులు చేతులెత్తేశారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని అన్ని మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో స్టాంప్ డ్యూటీలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఎకరాకు 20వేల స్టాంప్ డ్యూటీ ఉండగా.. పెంచిన మార్కెట్ విలువలతో లక్షరూపాయల వరకు చేరింది. దీంతో రంగారెడ్డిజిల్లాలో ప్లాట్లు, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. జిల్లా పరిధిలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గతంలో రోజుకు 80 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరుగగా.. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మాత్రమే జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది.
స్తంభించిన ప్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్ల క్రయవిక్రయాలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారు హైదరాబాద్ శివారుల్లోని రంగారెడ్డిజిల్లాలో ప్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు గతంలో పోటీపడేవారు. మార్కెట్ విలువల పెంపు ప్రభావంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదు. స్టాంప్ డ్యూటీలు గణనీయంగా పెరగడంతో శివారు ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీ విలువతో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకోవచ్చునని పలువురు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో అపార్ట్మెంట్లు, విల్లాల కల్చర్ ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో విల్లాలు, అపార్ట్మెంట్ల విక్రయదారులు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఒక్కసారిగా ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకు విల్లాలు, అపార్ట్మెంట్లల్లో ఫ్లాట్లు విక్రయించినవారు.. ప్రస్తుతం అవి అమ్ముడుపోక, పెట్టిన పెట్టుబడులు వెళ్లక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆశతో పెంచిన ధరలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది.