ఆదిబట్ల, ఏప్రిల్ 20 : రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల సర్కిల్ బొంగుళూరు రెవెన్యూ పరిధిలోని 25 ఎకరాల చెరువుపై రియల్టర్ల కన్ను పడింది. అవుటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన జిలాన్ఖాన్చెరువుతోపాటు దాని కట్ట, ఆ చెరువు నిండి అలుగు పారే పులిందర్వాగును కబ్జా చేసేందుకు..కొందరు రియల్టర్లు చెరువు పక్కన ఉన్న పట్టా భూమితోపాటు చెరు వు కట్ట కింద ఉన్న భూములను కొన్నారు.
వాటిని ఆసరాగా చేసుకొని చెరువు భూమినీ ఆక్రమించి అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకున్నారు. బొంగుళూరు గ్రామంలోని సర్వేనంబర్ 123, 124, 125, 434, 439, 440, 441, 442, 444లలో జిలాన్‌ఖాన్ చెరువు విస్తరించి ఉన్నది. ఈ చెరువు పుల్ట్యాంక్ లెవల్ 24 ఎకరాల 32 గుంటలుగా హెచ్ఎండీఏ అధికారులు నిర్ధారించి హద్దులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెరువు చుట్టు పక్కల ఉన్న రైతులు సగం వరకు చెరువును కబ్జా చేశారు. ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డును ఈ చెరువు మధ్య నుంచే ఏర్పాటు చేయడంతో చెరువు స్థలం రెండు భాగాలుగా విడిపోయింది. చెరువుకు ఆనుకుని ఉన్న భూముల నుంచే అవుటర్ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయడంతో అక్కడ భూములు కోల్పోయిన శిఖం, పట్టా రైతులకు అప్పటి ప్రభుత్వం పరిహారాన్ని కూడా చెల్లించింది.
కాగా, కొంతమంది రాజకీయ నాయకులు తమ తెలివి తేట లు, రెవెన్యూ అధికారుల అండదండలతో పరిహారం పొందిన రైతులతో సర్వీస్ రోడ్డులో పోయిన శిఖం, పట్టా భూమిని చెరువులో చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. దీంతో ఓ పేరు పొంది న రియల్ ఎస్టేట్ సంస్థ ఆ స్థలాన్ని కొని జిలాన్‌ఖాన్ చెరువు చుట్టూ రేకులతో కనబడకుండా చుట్టేసింది. అందులో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టారు. అందులో నుంచి మట్టిని తవ్వి పక్కనే ఉన్న మరో వెంచర్లోకి తరలిస్తున్నారు. అంతేకాకుండా జిలాన్ఖాన్చెరువు కట్ట కింద ఉన్న భూములనూ కొని చెరువు కట్టను కూడా కబ్జా చేసి ధ్వంసం చేశారు. అంతటితో ఆగని వెంచర్ నిర్వాహకులు కట్టనూ కబ్జా చేసి పక్కనే ఉన్న పులిందర్ వాగు కు చుట్టు రోడ్డుపై నుంచి వెళ్లే వారికి అందులో ఏం జరగుతుందో తెలియకుండా రేకుల షీట్లతో ప్రహరీ ఏర్పాటు చేశారు.

గతంలోనే కబ్జా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ‘నమస్తే తెలంగాణ’
రెండేండ్ల కిందటే జిలాన్ఖాన్చెరువు కబ్జా బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురాగా.. స్పందించిన ఆదిబట్ల మున్సిపల్ అధికారులు అక్కడ జరుగుతున్న పనులను నిలిపేయించారు. ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన జిలాన్ఖాన్చెరువును సర్వే చేశారు. కాగా, రెండేండ్ల తర్వాత మళ్లీ ఇప్పు డు అక్కడ రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ల అధికారులు మా త్రం అటు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. రియల్టరు ఇచ్చిన మా మూళ్లు తీసుకుని.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

వెంచర్లోకి వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు ధ్వంసం
ఆదిబట్లలో పుట్టిన పులిందర్‌వాగు వర్షాలకు పారుతూ ఆదిబట్ల నుంచి బొంగుళూరు గ్రామంలోని జిలాన్ఖాన్చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి పటేల్‌గూడ, మంగల్‌పల్లి మహమ్మాయ మ్మ ఆలయం మీదుగా ప్రవహించి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనాజ్‌పూర్ ఇందిరాసాగర్ చెరువులోకి కలుస్తుంది. కాగా, రియల్టర్లు జిలాన్ఖాన్చెరువు అలుగు పారే కాల్వలో రెండు సిమెంట్ పైపులు వేసి వాటి మీదుగా మట్టి పోసి దర్జాగా రోడ్డును చెరువుకట్ట కింద ఉన్న వెంచర్లోకి వెళ్లేందుకు వేశారు. అలాగే, అవుటర్ రింగ్ రోడ్డు నుంచి తమ వెంచర్లోకి వెళ్లేందుకు అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు ను ధ్వంసం చేసి బీటీ రోడ్డును ఏర్పాటు చేశారు. జిలాన్‌ఖాన్ చెరువు కబ్జాకు గురి కావడంతో చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
