రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ్యూచర్ సిటీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రీన్ఫీల్డ్ రోడ్లు తదితర అవసరాల పేరుతో భూసేకరణ చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన 15వేల ఎకరాలతోపాటు మరో 15వేల ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది.
ఇండస్ట్రియల్ పార్కు పేరుతో యాచారం మండలం మొండిగౌరెల్లి, చేవెళ్ల మండలంలోని ఆలూరు వంటి గ్రామాల్లో సుమారు రెండువేల ఎకరాల వరకు సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొహెడ గ్రామంలోని సర్వే నం.167/1లో పండ్ల మార్కెట్ పేరుతో 239 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ భూమిలో ఇప్పటికే అనేకమంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు.
మరోవైపు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు ట్రిపుల్ఆర్ను అనుసంధానం చేస్తూ శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి షాబాద్ మీదుగా కొడంగల్ వరకు ఏర్పాటు చేసే రోడ్డు కోసం భూసేకరణ చేపడుతున్నారు. మరోవైపు యాచారం మండలంలోని సాగర్ రహదారి నుంచి మేడిపల్లి మీదుగా ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక రహదారి ఏర్పాటు కోసం కూడా భూసేకరణ చేస్తున్నారు. అదే మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కూడా సర్కారు భూమిని పరిశ్రమల అవసరాల పేరుతో తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
భూసేకరణను వ్యతిరేకిస్తున్న జిల్లా రైతులు
ప్రభుత్వం జిల్లాలోని వేలాది ఎకరాల భూములను వివిధ అవసరాల పేరుతో పేదల నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. కాని, భూసేకరణకు జిల్లా అన్నదాతలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. అయినప్పటికీ సర్కారు రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడానికి మొగ్గు చూపుతున్నది. ప్రభుత్వం సేకరించే భూముల్లో దళితులు, పేద, మధ్యతరగతికి చెందినవారివి కావడంతో సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వివిధ అవసరాల పేరుతో పేదల నుంచి బలవంతంగా సేకరించే భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఈ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
కొత్తగా 4వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్లు
జిల్లాలోని ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల వంటి అవసరాల పేరుతో ఇప్పటి వరకు జిల్లాలో 4వేల నుంచి 5వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములన్నీ దళితులు, గిరిజనులతోపాటు నిరుపేదల కోసం సర్కారు గతంలో పట్టాలిచ్చిన భూములు కావడం విశేషం. ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న పేద రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు సిద్ధమైంది.
వివాదాస్పద భూమి మార్కెట్కు..
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొహెడ గ్రామంలో సర్వే నం.167/1లో 239 ఎకరాల వివాదాస్పద భూమిని పండ్ల మార్కెట్కు కేటాయించారు. పండ్ల మార్కెట్ కోసం గతంలో ఎలాంటి వివాదాలకు తావులేని భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి పండ్ల మార్కెట్కు ఇచ్చింది. కాని, ఆ భూమిని ఇటీవల కాంగ్రెస్ సర్కారు టీజీఐఐసీకి బదలాయిస్తూ వివాదంలో ఉన్న భూమిని మార్కెట్కు కేటాయించారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
