ఇబ్రహీంపట్నం, నవంబర్ 17 : బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనకై ఆయా శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ..18సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురకు పెళ్లి చేయటం చట్టరీత్య నేరమన్నారు. బాల్య వివాహం జరిపించిన లేదా పాల్గొన్న వారికి రెండు సంవత్సరాల కారాగార శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు.
సీడీపీఓ వనితాదేవీ మాట్లాడుతూ..బాల్య వివాహాల నివారణకు అంగన్వాడీలు, ఆశావర్కర్లతో పాటు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో బాల్యవివాహాలు చేస్తే తీసుకోవాల్సిన చర్యలతో పాటు బాల్య వివాహాల నివారణ కోసం గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం ప్రచార రథాన్ని ఆర్డీఓ, సీడీపీఓలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంఈఓ హీర్యానాయక్, ఏపీఎం సాంబశివ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పల్లవి, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.