వికారాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నది. ప్రతిరోజూ ఏదో ఒక చోట టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడుతున్నది. బ్లాక్ మార్కెట్‌కు తరకుండా చర్యలు తీసుకున్నా మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
రేషన్ దుకాణాల ద్వారా తీసుకున్న సన్న బియ్యాన్ని మొదట ఒకట్రెండు నెలలు తిన్న పేదలు ఆ తర్వాత నాణ్యత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో దాదాపుగా 70% వరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రేషన్ బియ్యం నాణ్య త లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, సీఎంఆర్ రైస్ అందజేయాల్సిన రైస్ మిల్లర్లు ఆ బియ్యాన్ని తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి అందజేస్తూ రీసైకిల్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లాలో గతేడాదిలో 582 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం అధికారులు చేసుకున్నారు. అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో 428 మెట్రిక్ టన్నులు, పరిగి సెగ్మెంట్లో 86, వికారాబాద్ సెగ్మెంట్లో 68 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.
ప్రతిరోజూ ఏదో ఒక చోట టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పీడీఎస్ బియ్యం పట్టుపడుతుండడంతో జిల్లాలో ఏ స్థాయిలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి తీసుకొచ్చిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలంటే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి.. మిల్లర్లకు అప్పజెప్పితే వారు సీఎంఆర్ కింద బియ్యం రూపంలో తిరిగి పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎంఆర్ బియ్యం అందజేయడంలోనే మిల్లర్లు మాయజాలం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్లు ఇచ్చే మామూళ్లు తీసుకుంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు రెండు, మూడు సీజన్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోయినా పట్టించుకోకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని బియ్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లు తిరిగి ఇస్తున్నా.. పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.
రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి జిల్లాలో పండించే సన్నబియ్యం ఒక నెలలో రేషన్ షాపుల ద్వారా పం పిణీ చేసేందుకు కూడా సరిపోకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకొని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తున్నారు. జిల్లాకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతున్నది. కాగా, దిగుమతి చేసుకునే ఆ సన్నబియ్యాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారులు పరిశీలించిన తర్వాతే సరఫరాకు అనుమతిస్తారు. అయితే గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతను చూస్తే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని మెజార్టీ రేషన్ దుకాణాల్లోని సన్నబియ్యం క్వాలిటీ లేకపోవడంతో ప్రజలు తినకుండా బయట విక్రయిస్తున్నారు. జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 5,780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. కాగా, జిల్లాలో రేషన్‌కార్డులు 2,48,475 ఉండగా లబ్ధిదారులు 8,87,912 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 26,621 ఉండగా లబ్ధిదారులు 79,524 మంది.. అన్నపూర్ణ కార్డుదారులు 41 మంది, ఆహార భద్రతాకార్డులు 2,21,818 ఉండగా లబ్ధిదారులు 8,08,347 మంది ఉన్నారు.