నందిగామ : ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని నగలు, విలువైన కాగితాలు దొంగతనం చేసిన సంఘటన బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట తండాకు చెందిన మూడవత్ మంగ్యా మంగళవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కొత్తూరు మండలంలోని సుదాబాయితండాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళంతో పాటు బీరువ తాళం పగులగొట్టి ఉన్నాయి.
బీరువలో ఉన్న రెండు జతల కమ్మలు, 30తులల వెండి, ప్లాటు కాగితాలు, రేషన్‌కార్డు దొంగలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సీఐ రామయ్య తెలిపారు.