ఇబ్రహీంపట్నం : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగాయి. శుక్రవారం ఉదయం నుంచే భక్తులు స్నానం ఆచరించి శివలయాలకు వెల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల్లో కార్తీక జ్యోతులు వెలిగించి భక్తిని చాటుకున్నారు. అలాగే, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో వ్రతాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని త్రిశక్తి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగం ముందు మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే, ఇబ్రహీంపట్నంలో ఉన్న శివాలయానికే ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు.
యాచారం మండలంలోని నందివనపర్తి, మంచాల మండలంలోని బుగ్గరామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఇబ్రహీంపట్నం అఖండ ట్రస్టు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హారతి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు హారతి ఇచ్చారు. అనంతరం ఇబ్రహీంపట్నం నుంచి రాచకొండలోని ప్రసిద్ధి చెందిన శివాలయం వరకు ప్రత్యేక ర్యాలిద్వారా వెల్లి జ్యోతిని వెలిగించారు.