ఆన్లైన్లో నమోదు చేయకున్నా ఏవో అనుమతితో ధాన్యం అమ్ముకోవాలి
బొంరాస్ పేట : వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యం కొనుగోళ్ల, రికార్డులను పరిశీలించి నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి మద్ధతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఖాళీ సంచుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి బాగా ఎండబెట్టిన ధాన్యాన్ని తేవాలని రైతులకు సూచించారు. పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకున్నా వ్యవసాయాధికారి అనుమతితో కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఖాళీ సంచులను ఇవ్వడం లేదని కొందరు రైతులు, ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల ఖాతాలలో వేస్తే తమ పరిస్థితి ఏంటని కౌలు రైతులు, ధాన్యం డబ్బులను పంట రుణాల బాకీ కింద బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మహేందర్, పార్టీ నాయకుడు సుభాష్రావు పాల్గొన్నారు.