ఆదిబట్ల, సెప్టెంబర్ 17 : తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రభాగంలో నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మించబడిన తెలంగాణ రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన సంపాదనను పరిరక్షించడంతోపాటు ప్రజల కష్టాలను తీర్చడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు.
మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణం, రూ.500లకే నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్న అంశాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుపేదలకు 51వేల 874 రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. కోటీ 26 లక్షల మంది రైతులకు నాలుగు విడతల్లో 769.53 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
రానున్న రోజుల్లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రీజినల్ రింగు రోడ్డుతో పాటు ఔటర్ రింగు రోడ్డును కలిపేందుకు ఉద్దేశించబడిన రేడియల్ రోడ్ 300 అడుగుల వెడల్పుతో 4వేల కోట్ల రూపాయల నిర్మాణంతో చేపట్టామన్నారు. సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. 1948లో ఆపరేషన్ పోలో తరువాత హైదారాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయిన రోజు అని, అమరుల త్యాగ ఫలితంగా విలీనం జరిగిన రోజు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, రోడ్ల భవనాల కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధికారులున్నారు.