ఆదిభట్ల, మార్చి 10: మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా రావిర్యాల, కొంగరకుర్దూ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధిత రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్లో రోడ్డు పనులు చేపడితే ప్రాణాలు ఫణంగా పెట్టైనా సరే మా భూములు కాపాడుకుంటామని తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
రావిర్యాల, కొంగరకుర్దూ గ్రామాల్లోని సర్వేనెంబర్ 13 గల పట్టా భూముల్లో పలువురు రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అయితే ఈ భూముల్లో 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. అయితే తమకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా.. తమ భూమిలో రోడ్డు పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి, కూరగాయల పొలాల్లోకి తమ అనుమతి లేకుండా రావడం ఏంటని నిలదీశామని.. కానీ తమను తమ పొలాల్లో నుంచే బయటకు గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూమిని లాక్కోవడం ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆవేదన చెందిన రైతులు సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతన్నలు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేపడుతున్న రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.