రంగారెడ్డి, జూన్ 8, (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏ ఒక్క రైతూ నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను జిల్లా ఉన్నతాధికారులు జిల్లాస్థాయి, డివిజినల్, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించారు. ఇటీవల మండల స్థాయిలో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు, డివిజనల్ స్థాయిలో ఐదు టాస్క్‌ఫోర్స్ బృందాలు, మండల స్థాయిలో 27 టాస్క్‌ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయాధికారులు, పోలీసులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 34 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం..
జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలపై వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3 కేసులు నమోదు కాగా, 34.25 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత మూడు కేసుల్లో రూ.44.16 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ బృందాలు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సరూర్‌నగర్‌లో, కర్నూల్ జిల్లా నంద్యాల నుంచి నకిలీ విత్తనాలను తరలిస్తుండగా శంషాబాద్ మండలం పాలమాకులలో, ఫరూఖ్‌నగర్ మండలం రాయకల్ వద్ద టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేసి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది 18 కేసులు నమోదు కాగా, 97 క్వింటాళ్ల విత్తనాలను, 2020 సంవత్సరంలో 72.9 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పత్తి విత్తనాలను లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొందరు వ్యక్తులు గ్రామాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంపై టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండండి…
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్‌టీ పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి రైతులు మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
సరిపోను విత్తనాలు సిద్ధం..
జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఆయా పంటలకు సంబంధించి 26,702 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అవసరమైన విత్తనాల్లో పత్తి-5,50,100 ప్యాకెట్లు, వరి-18,750 క్వింటాళ్లు, జొన్న-600 క్వింటాళ్లు, మొక్కజొన్న-3840 క్వింటాళ్లు, పెసలు-28 క్వింటాళ్లు, కందులు-2820 క్వింటాళ్లు, మినుములు-13.6 క్వింటాళ్లు, వేరుశనగ-144 క్వింటాళ్లు, ఆముదం-3 క్వింటాళ్లు, సోయాబీన్-7 క్వింటాళ్లు, ఇతర పంటలకు సంబంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు.
సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను 65 శాతం మేర సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. ఎరువులకు సంబంధించి జిల్లాకు యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,01,841 టన్నులు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం జిల్లాలో యూరియా-14,523 టన్నులు, డీఏపీ-3291 టన్నులు, ఎస్ఎస్పీ-153 టన్నులు, ఎంవోసీ-296 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు-8272 టన్నులు కలిపి 26,537 టన్నుల మేర ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో 4,88,597 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి-2,75,050 ఎకరాలు, కందులు-70,520 ఎకరాలు, వరి 75 వేల ఎకరాలు, జొన్న-15 వేల ఎకరాలు, మొక్కజొన్న 48 వేల ఎకరాలు, పెసలు-352 ఎకరాలు, మినుములు-170 ఎకరాలు, వేరుశనగ-240 ఎకరాలు, ఆముదం-120 ఎకరాలు, సోయాబీన్-20 ఎకరాలు, ఇతర పంటలు-4125 ఎకరాల్లో వానకాలంలో సాగవుతాయని అంచనా వేశారు.