కొడంగల్, మే 26 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ పల్లె చూసినా అభివృద్ధిలో ఔరా అనిపించేలా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు నేడు అద్భుతంగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు సమసిపోయాయి. ఇప్పటికే నాలుగు విడుతలు పల్లె, పట్టణ ప్రగతి పూర్తి కాగా, జూన్ 3వ తేదీ నుంచి ఐదో విడుతను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయిచింది. హరితహారం కార్యక్రమంతో ఏ పల్లె చూసినా పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి జనాభా ప్రాతిపదికన నెలనెలా ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నది.
నాలుగో విడుత పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు..
వికారాబాద్ జిల్లాలోని 536 గ్రామపంచాయతీల్లో 566 పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఏర్పడ్డాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను మంజూరు చేశారు. జిల్లాలో 1,06,092 పాత ఇండ్ల కూల్చివేత, 1,396 ఖాళీ స్థలాలను శుభ్రంగా మార్చారు. 1,410 గుంతల పూడ్చివేత. 1458 నీటి ట్యాంక్‌ల శుభ్రం. 1629 లీకేజీల మరమ్మతు, 127 పాత బోర్ల మూసివేత, 293 పాత బావుల పూడ్చివేత, 2,365 విద్యుత్ లైన్లు, 3,216 విద్యుత్ స్తంభాలను సరి చేశారు. 1,436 స్తంభాలకు థర్డ్వైర్ను ఏర్పాటు చేశారు. 1,05547 రోడ్ సైడ్ మొక్కలను, 16,813 కమ్యూనిటీ స్థలాల్లో , 2,898 ఓపెన్ స్థలాల్లో మొక్కలు నాటారు. పాఠశాల, కమ్యూనిటీ స్థలాలు, మార్కెట్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తి చేశారు.
మారుతున్న రూపురేఖలు..
పల్లెప్రగతితో గ్రామాలు కళకళలాడుతున్నాయి. ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్‌లు, సిమెంటు బెంచీలు, విద్యుత్, తాగునీటి వసతులు కల్పించారు. ఏ ఊరికెళ్లినా రోడ్ల వెంట పచ్చని మొక్కలు తోరణాల్లా కనువిందు చేస్తున్నాయి. వైకుంఠధామాల నిర్మాణంతో చెరువు గట్లపై ఖననం చేసే ఇబ్బందులు తప్పాయి. వైకుంఠధామాల్లో ప్లాట్ ఫాం, స్నానపు గదులు, నీటి సౌకర్యం, దుస్తువులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
పూర్తిస్థాయిలో స్వచ్ఛత..
ప్రతి పల్లెలో ఇంటింటికీ ట్రాక్టర్‌తో వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారీ చేసి విక్రయిస్తుండడంతో గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. గ్రామ వీధుల్లో ఎక్కడా చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో స్వచ్ఛతతో తులతూగుతున్నాయి.
ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతికి ఏర్పాట్లు..
జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇదివరకే పంచాయతీ పాలకవర్గాలకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను సేకరించాం.
– మల్లారెడ్డి, డీపీవో, వికారాబాద్