తాండూరు రూరల్, ఏప్రిల్ 28 : ఉల్లి సాగులో మిట్టబాసుపల్లి మేటిగా నిలుస్తున్నది. అయితే రైతుబంధు పథకం ఈ గ్రామ రైతులకు వరంగా మారింది. పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయడంలేదు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకంతోనే ఎక్కువ శాతం రైతులు ఉల్లి పంటను సాగు చేస్తుండటం విశేషం. తాండూరు మండల పరిధిలోని మిట్టబాసుపల్లి గ్రామ రైతులు కేవలం ఉల్లి పంటను మాత్రమే నమ్ముకుంటారు. సుమారు 90 శాతం రైతులు ఉల్లి పంటను సాగు చేస్తారు. కేవలం 10 శాతం మంది రైతులు ఇతర పంటలు సాగు చేస్తారు.
ప్రతిఏటా గ్రామంలో సుమారు 400 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు ఉల్లిపంటను సాగు చేస్తారు. నియోజకవర్గంలోనే మిట్టబాసుపల్లి ఉల్లిపంట సాగుకు పెట్టింది పేరుగా ఉన్నది. ఉల్లికి ధరలు మార్కెటో ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఎప్పుడే ధర పెరుగుతుందో, ఎప్పుడు ధర పడిపోతుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉంటాయి. అయినా ఈ గ్రామ రైతులు మాత్రం ఉల్లినే నమ్ముకుంటారు. ఉల్లిసాగు చేసేందుకు ఒక ఎకరాకు రూ.50 వేల వ్యయం అవుతున్నది. ఉల్లినాట్లు వేసినప్పుటి నుంచి కోత కోసే వరకు వ్యయం ఎక్కుగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఈ గ్రామంలో పండించిన పంటలను ప్రతి ఏటా లారీల్లో వందల సంఖ్యలో హైదరాబాద్లోని మలక్పేట మార్కెట్కు తరలిస్తారు. మార్కెట్లో క్వింటాళ్ల ధర రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంటే రైతుకు గిట్టుబాటు ధర వస్తోంది.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఉల్లి పంట చేతికి వస్తోంది. ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చిన రైతుకు మార్కెట్లో ఉల్లి తక్కుగా ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఏప్రిల్ నెలలో వచ్చే వరకు ఉల్లి మార్కెట్లో గణనీయంగా తగ్గిపోతూ వస్తోందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం క్వింటా ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతున్నది. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నాడు.
గ్రామంలో పండించే ఉల్లి రైతులకు పంట పెట్టుబడి రైతుబంధు. 90 శాతం రైతులు రైతుబంధు కింద సీఎం కేసీఆర్ ఇచ్చే డబ్బులతోనే పెట్టుబడితో ఉల్లి పంట నాట్లు వేస్తారు. రైతుబంధు వచ్చినప్పటి నుంచి ఈ గ్రామ చిన్న, సన్నకారు రైతులు అప్పులు చేయడంలేదు. పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండుసార్లు సాయం చేస్తుండటంతో గ్రామ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
ఉల్లి ధరలు మార్కెట్లో స్థిరంగా ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. మార్కె ట్లో ఒడిదుడుకుల కారణంగా చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తు న్నది. ధరలు స్థిరంగా ఉంటే బాగుటుంది.
– పెంటయ్య, రైతు
మండలంలోనే అత్యధికంగా ఉల్లిసాగు చేసే మిట్టబాసుపల్లి గ్రామ పరిధిలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మార్కెట్లో ధరలు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది.
– నరేందర్రెడ్డి, రైతు