ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 28 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే చెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ వంటి సౌకర్యాలకు రూ.12కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడే ఉన్న ఇరిగేషన్, హెచ్ఎండీఏ, టూరిజం అధికారులకు చెరువు సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అధికారులు సుందరీకరణ పనులకు సంబంధించిన నివేదికతో పాటు పలు నమూనాలను సిద్ధం చేశారు.
ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టూరిజం ఈఈ పద్మ, డీఈ వెంకటరమణ, హెచ్ఎండీఏ ఆర్కిటెక్ శ్రీలేఖతో పాటు పలువురు అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన నమూనాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్వల్ప మార్పులు మినహా తయారు చేసిన నమూనాలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అంగీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగడంతో పాటు మంచి బోటింగ్పార్కుగా మారనుందని వివరించారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిలో ఉన్న పెద్దచెరువుకు ఇప్పటికే సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నందున చెరువుకట్టను వెడల్పు చేయటంతో పాటు చెరువువైపు ఉన్న కట్టపై రంగురంగుల పూలచెట్లను ఏర్పాటు చేయాలని, కూర్చోవడానికి వీలుగా బెంచీలు, ఇతర సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. బోటింగ్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మాణాలు, పార్కు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్‌పార్కు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతిపాదనలదే ఆలస్యమని నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో వాకర్ పార్కు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యేకిషన్రెడ్డి తెలిపారు. చిన్నచెరువు నీరులేక పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో కలుపు మొక్కలు వెలిసి ఆక్రమణలకు గురవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానికులకు ఉదయం వాకింగ్ చేసుకోవటానికి అనుకూలంగా వాకర్ పార్కుగా మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.