ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 22 : అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం ఇబ్రహీంపట్నంలోని బాలాజీగార్డెన్లో అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థికభారం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి భరోసాను కల్పిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, దళితబంధు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
నేడు తెలంగాణలో ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు ఆయా రాష్ర్టాల్లో అమలు చేసేందుకు, తెలంగాణ మంత్రుల వద్ద సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రంగారెడ్డిజిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి వంటి పథకాల్లో చాలామంది ప్రజలకు లబ్ధిచేకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, తాసిల్దార్ అనిత, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, సహకార సంఘం చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి లక్ష్మీ మెగాటౌన్ షిప్లో స్వీపర్‌గా పని చేసే సుజాత భర్త శ్రీనివాస్ అకాల మరణం చెందాడు. కాలనీవాసులు రూ.లక్ష జమచేసి కాలనీ అధ్యక్షుడు వెదిరె రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో సుజాతకు ఆ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో స్వీపర్‌గా పని చేస్తున్న మహిళకు కాలనీవాసులంతా ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు ధర్మేశ్ రామచంద్రారెడ్డి, పులిందర్రెడ్డి, పూర్ణ చంద్రరావు, సురేశ్, నాగయ్య, ఆంజనేయులు, జంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రేఖ పాల్గొన్నారు.