పెద్దేముల్, డిసెంబర్ 21 : గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వన నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి 100% శాతం వీలైనంత త్వరగా మార్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీఫెన్ నీల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేసి పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అనేది స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వమని.. దాని పరిధిలో పనిచేసే ప్రతి అధికారి సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు.
ముఖ్యంగా ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి వన నర్సరీలను మార్చాల్సిందేనని.. కలెక్టర్ ఆదేశాలను ఎవరైనా పాటించకపోతే తదుపరి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామస్థాయిలో సమన్వయంతో పనులు చేసుకోవాలని కారణాలు చెప్పరాదని.. అందుకు సర్పంచులు కూడా అధికారులకు సహకరించాలన్నారు. మండలంలో మన్సాన్పల్లి, మారేపల్లితండా, మంబాపూర్, గోపాల్పూర్ గ్రామాల్లో ఇంకా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కాలేదని.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మస్టర్లలో పెండింగులు ఉండరాదని, టీజీకేపీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల బాధ్యత కీలకమన్నారు. టీఏ, ఎఫ్ఏ, సీవో, జేపీఎస్‌లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. లక్ష్యాలు నెరవేరాలంటే అధికారుల మధ్య సమన్వయం తప్పకుండా ఉండాలన్నారు. అంతకుముందు గ్రామాలవారీగా వన నర్సరీలు, జరిగిన పనులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఎన్ఎంఎంఎస్ యాప్ తదితర అంశాలపై గ్రామాలవారీగా అధికారులతో రివ్యూ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో సుష్మా, ఏపీవో లక్ష్మీదేవి, ఈసీ కృష్ణ పాల్గొన్నారు.