నందిగామ, డిసెంబర్ 19: రైతన్నల అభ్యున్నతికి మండలంలోని చేగూరు సహకార సంఘం కృషి చేస్తున్నది. రైతుల సౌకర్యార్థం నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అంతేకాకుండా సంఘంలోని సభ్యులకు రుణాలను కూడా అందిస్తూ తోడ్పాటును అందిస్తున్నది. చేగూరు సహకార సంఘం 1978లో ఏర్పడింది. ఇందులో వివిధ గ్రామాలకు చెందిన 2,254 రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. 461 మంది రైతులు సంఘం నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ సంఘం చైర్మన్గా అశోక్, డైరెక్టర్లుగా 12మంది కొనసాగుతున్నారు. ప్రస్తుతం సహకార సంఘం ఎల్టీ, ఎస్టీ, షార్ట్ టర్మ్, స్వయం ఉపాధికి సంబంధించిన లోన్లు మొత్తం కలిపి సుమారు రూ.6 కోట్లకు పైగా టర్నోవర్తో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది.
గోదాం ఏర్పాటుకు స్థలం కేటాయింపు..
చేగూరు సహకార సంఘం కార్యాలయ భవనంలోని గోదాంలోనే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను నిల్వ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు పండించిన ధాన్యం, ఎరువులు, విత్తనాలను నిల్వ చేసేందుకు పెద్ద గోదామును నిర్మించేందుకు పాలకమండలి సభ్యులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చేగూరు శివారులోని సర్వేనంబరు 213లో రెండు ఎకరాల స్థలాన్ని గోదాం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే గోదామును నిర్మించి అం దుబాటులోకి తీసుకొచ్చేందుకు పాలక మండలిసభ్యులు, అధికారులు కృషి చేస్తున్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం
రైతన్నల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సహకార సంఘం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నాం. అంతేకాకుండా అవసరమైన రుణాలను కూడా అందిస్తూ తోడ్పాటు ఇస్తున్నాం.
– గోర్లపల్లి అశోక్, చేగూరు, పీఏసీఎస్ చైర్మన్