మొయినాబాద్, అక్టోబర్ 28 : ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. నాలుగేండ్లు ఫోకస్ పెట్టి కష్టపడి విద్యను అభ్యసిస్తే మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి రెవెన్యూలో గల జేబీఐఈటీ, భాస్కర ఇంజినీరింగ్ కళాశాలలు శుక్రవారం సంయుక్తంగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమం జేబీ విద్యా సంస్థల కార్యదర్శి జేబీ కృష్ణారావు అధ్యక్షతన కొనసాగగా.. ముఖ్య అతిథిగా విచ్చేసిన నవీన్ మిట్టల్, రామకృష్ణమఠం ప్రతినిధి బ్రహ్మచారి సత్యచైతన్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో కలలు పెట్టుకుని కష్టపడి చదివిస్తారని.. వారి కలలను సాకారం చేయాలని నవీన్ మిట్టల్ సూచించారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. లక్ష్యానికి తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
అప్పుడే అవకాశాలు వస్తాయని చెప్పారు. విద్యతోపాటు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. జేబీ విద్యా సంస్థలో మంచి సంప్రదాయం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యా సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యనభ్యసించి మంచి భవిషత్తును నిర్మించుకోవాలని సూచించారు.
గూగుల్‌లో విద్యార్థులకు కావాల్సినంత సమాచారం అందుబాటులో ఉంటుంది కాని.. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ప్రతి విద్యార్థికి ఓ గురువు తప్పనిసరని రామకృష్ణమఠం ప్రతినిధి బ్రహ్మచారి సత్య చైతన్య అన్నారు. యువతకు స్వామి వివేకానంద మార్గదర్శకులని చెప్పారు. సమాజంలో అనేక సమస్యలు వస్తాయని.. వాటిని అధిగమించి వెళ్లినవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జేబీ విద్యా సంస్థల కార్యదర్శి జేవీ కృష్ణారావు మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేబీజీఈఐ సీఈవో ఎస్ఎస్ దసక, జేబీఐఈటీ ప్రిన్సిపాల్ పీసీ కృష్ణమాచారి, భాస్కర ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.