ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్‌లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మంచాల సహకార సంఘం కార్యాలయం ఎదుట ఎరువుకోసం అన్నదాతలు ఉదయం ఐదు గంటల నుంచే వందలాదిగా నిరీక్షించగా కొందరికే యూరియా దొరికింది.
అలాగే, నందిగామ సొసైటీకి యూరియా లారీ వస్తుందని అన్నదాతలకు తెలియడం తో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో తరలివచ్చి పడిగాపులు కాశారు. షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం యూరియా రాకపోవడంతో ఓపిక నశించిన రైతులు పట్టణ ముఖ్య కూడలిలో నిరసన తెలిపేందుకు సిద్ధం కాగా, పోలీసులు వారికి నచ్చజెప్పి ఇండ్లకు పంపించారు.
మంచాల, సెప్టెంబర్ 5 : మంచాల సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచే అన్నదాతలు వందలాదిగా యూరియా కోసం బారులుదీరారు. తిండితిప్పలు లేకుండా లైన్లో నిలబడితే కొంతమంది రైతులకు మాత్రమే బస్తా చొప్పున అక్కడి సిబ్బంది పోలీసు పహారాలో పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారు జాము నుంచే ఎరువు కోసం నిరీక్షిస్తే తమకు ఎందుకు ఇవ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా యూరియా కోసం సహకార సంఘం కార్యాలయానికి వచ్చి పడిగాపులు కాస్తున్నా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు అదునుకు ఎరువు వేయకుం టే దిగుబడిలో తేడా వస్తుందని పలువురు రైతులు పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యల రాలేదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు.
నందిగామ : నందిగామ సొసైటీకి శుక్రవారం లారీ యూరియా వస్తుందనే సమాచారంతో చుట్టూ పక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో రైతులు తెల్లవారుజూము నుంచే సొసైటీ వద్దకు చేరుకుని క్యూలో ఉన్నారు. లారీ యూ రియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున మాత్ర మే పంపిణీ చేశారు. మిగిలిన క్యూలో ఉన్న రైతులకు ఎరువు అందకపోవడం తో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్న దొరకడంలేదని మం డిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు యూరియా పుష్కలంగా అందుబాటులో ఉండేదని, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక రైతులకు యూరియా దొరకడంలేదన్నారు. అన్నదాతలకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని రోజులుగా యూరియా కోసం చేగూరు, నందిగామ, మేకగూడ సొసైటీల చుట్టూ తిరుగుతున్నా దొరకడంలేదు. పంటలకు యూరి యా వేయకపోతే సరిగ్గా పండవు. ప్రభుత్వం స్పం దించి రైతులకు సరిపడా యూరియా అందించాలి – కుమ్మరి నర్సింహులు, రైతు, శ్రీనివాసులుగూడ
గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కష్టాలే లేకుండే. కాంగ్రెస్ వచ్చి కష్టాలను తీసుకొచ్చింది. ఎరువు దొరక్క గత 15 రోజులుగా పలు సొసైటీల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వం, అధికారులు స్పందించి యూరియా కొరత లేకుం డా చర్యలు తీసుకోవాలి. – బేగ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు, వీర్లపల్లి
షాద్‌నగర్ టౌన్ : యూరియా కోసం అన్నదాతలు గత కొన్ని రోజులుగా నిరీక్షిస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం యూరియా రాకపోవడంతో ఓపిక నశించిన రైతులు పట్టణ ముఖ్యకూడలిలో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి వారికి నచ్చజెప్పి పంపించారు. పంటలను సాగు చేసి యూరియా దొరకక నానా తంటాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రోజుల తరబడి గంటలకొద్దీగా ఎదురుచూస్తున్నామని, అయినా దొరకడం లేదని వాపోతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.