‘రంగారెడ్డి జిల్లాను ముసురు ముంచెత్తుతున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తల్తెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ప్రాంతాల్లో 24 గంటలూ సహాయక చర్యలు చేపడుతున్నాం..’ అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వానల ప్రభావం జిల్లాపై ఎలా ఉన్నది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నదానిపై ‘నమస్తే తెలంగాణ’కు పలు విషయాలు వెల్లడించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ వరద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలను అలర్ట్ చేశామని, అన్ని విభాగాల కిందిస్థాయి సిబ్బంది 24 గంటలు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు సైతం నిరంతర పర్యవేక్షణతో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారన్నారు.అగ్నిమాపక సిబ్బందితోపాటు అవసరమైతే తక్షణమే రంగంలోకి దిగి సహాయ, సహకారాలు అందించేందుకు రెస్క్యూ, డీఆర్ఎఫ్కు చెందిన 20 బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. టైఫాయిడ్, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులకు తగిన సూచనలిచ్చేలా వ్యవసాయాధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ప్రశ్న : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?
కలెక్టర్ : వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలను అలర్ట్ చేయడం జరిగింది. అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించాం. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వరదలొస్తే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చాం. కిందిస్థాయి సిబ్బంది 24 గంటలు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం నిరంతర పర్యవేక్షణతో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
ప్రశ్న : ముంపు ప్రాంతాల్లో తీసుకున్న చర్యలేమిటి ?
కలెక్టర్ : జిల్లాలో గత వారం రోజులుగా 5-6 సెం.మీ.లకు మించి వర్షపాతం నమోదు కాలేదు. అయితే గతంలో జీహెచ్ఎంసీలో వచ్చిన వరద సందర్భంగా ఎదురైన అనుభవాలతో ముందస్తు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాం. బడంగ్పేట్ వంటి మున్సిపాలిటీ ప్రాంతాల్లోనే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అగ్నిమాపక సిబ్బందితోపాటు అవసరమైతే తక్షణమే రంగంలోకి దిగి సహాయ, సహకారాలు అందించేందుకు రెస్క్యూ, డీఆర్ఎఫ్కు చెందిన ఇరవై బృందాలను రెడీగా ఉంచాం.
ప్రశ్న : ఇప్పటివరకు కురిసిన వర్షాలకు ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టాల వంటివి చోటుచేసుకున్నాయా..?
కలెక్టర్ : లేదు. జిల్లాలో ముంపుకు గురయ్యే హ్యాబిటేషన్లు ఏమీ లేవు. జిల్లాలో వెయ్యికి పైగా ఉన్న అన్ని చెరువులు, కుంటల్లోకి ఆశించిన స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. మూసీ, ఈసీ వాగులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీరప్రాంతంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారయంత్రాంగం పర్యవేక్షిస్తున్నది. అక్కడక్కడా శిథిల ఇండ్లు పాక్షికంగా దెబ్బతినడం మినహాయిస్తే..ప్రస్తుత వర్షాల వల్ల చెప్పుకోదగ్గ నష్టమేమీ లేదు.
నమస్తే : సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య పరంగా తీసుకున్న చర్యలేమిటి ?
కలెక్టర్ : వర్షాల నేపథ్యంలో పారిశుద్ద్య నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే జ్వరాలు మినహా ఇతరత్రా సీజనల్ వ్యాధులు జిల్లాలో చాలా తక్కువే. ఏదిఏమైనా టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు బాధితులకు సత్వర వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశాం. ఆసుపత్రులతో మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం.
ప్రశ్న : పంటల సాగు పరంగా జిల్లాలో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
కలెక్టర్ : వానకాలం సీజన్లో అంచనాల మేరకు పంటలు సాగయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 3.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా ఉన్నది. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వర్షాల కారణంగా వచ్చే చీడ, పీడల నివారణకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కరెంటు విషయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి.
ప్రశ్న : మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మీరు చేసే విజ్ఞప్తి..?
కలెక్టర్ : ఇంకో రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులు, ఇతర శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం.