ఇబ్రహీంపట్నం రూరల్, మే 21 : ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు చివరి గింజా కొంటామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సహకార సంఘం పరిధిలోని పోచారం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 7995050714 నంబర్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేసి రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం నిల్వలు లిఫ్టింగ్ జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర చెల్లించనున్నట్లు రైతుకు భరోసా ఇచ్చారు. తొందరపడి దళారులను ఆశ్రయించి నష్టపోవద్దన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 17 కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరిస్తున్నామన్నారు.
కేంద్రాల్లో సమస్యలుంటే నేరుగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టర్ వెంట ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, డీసీవో ధాత్రీదేవి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మనోహర్‌కుమార్ రాథోడ్, సివిల్‌సప్లయ్ డీఎం విజయలక్ష్మి, ఇబ్రహీంపట్నం వ్యవసాయాధికారి వరప్రసాద్‌రెడ్డి, ఏఈవో రఘు పాల్గొన్నారు.