రంగారెడ్డి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదని రంగారెడ్డి కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా.. అవినీతికి పాల్పడినా సహించేది లేదని, అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే తమ తీరును మార్చుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి తెస్తే.. తలొగ్గేది లేదన్నారు.
తనపై ఉన్న నమ్మకంతోనే రంగారెడ్డి జిల్లా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం కలెక్టర్ శశాంక పలు అంశాలపై విలేకరులతో ముచ్చటించారు. ఎవరైనా తప్పు చేస్తే ఏసీబీ వంటి సంస్థలకు పట్టుబడడంతోపాటు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అధికారులతో నిర్వహించే ప్రతి సమీక్షలోనూ తరచుగా చెబుతుంటానని అన్నారు.
పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం..
రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఏ కాగితం లేకుండానే గతంలో రెవెన్యూ దరఖాస్తులకు ఆమోదం తెలిపిన సందర్భాలు ఉన్నాయన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుతోపాటు ఫిజికల్ రిపోర్టు తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలన చేశాకనే ఆమోదం తెలుపుతున్నట్లు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేనాటికి జిల్లాలో 46వేల వరకు పెండింగ్ దరఖాస్తులు ఉండేవని, క్రమక్రమంగా పరిష్కరించి ప్రస్తుతానికి 27వేలకు తగ్గించినట్లు తెలిపారు. జూన్ నాటికి ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటినీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఏ కారణం లేకుండా దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని, ఇది వాస్తవం కాదన్నారు. సదరు వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నందున తిరస్కరించిన ప్రతి దరఖాస్తుకు గల కారణాలను పోర్టల్‌లో తెలియచెబుతున్నామన్నారు. తాను వచ్చాక అన్యాక్రాంతమైన రూ.వందల కోట్ల విలువైన భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం
ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలోని అనాజ్‌పూర్, నాగన్‌పల్లి గ్రామాల్లోని అసైన్డ్ భూముల వ్యవహారంలో నెలకొన్న వివాదంపై కలెక్టర్ మాట్లాడారు. అసైన్డ్ భూములను రైతులు ఇవ్వడం.. వేరొకరు తీసుకోవడం కుదరదని, అమ్మడం, కొనడం వంటి ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేశామన్నారు. రైతుల నుంచి సమాధానం వచ్చాక ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివాదాస్పద భూముల్లో ప్రస్తుతానికి పనులను నిలిపివేశామన్నారు. ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.