రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : పొరపాట్లకు తావులేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శంషాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన మౌలిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు.
విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరుగకుండా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు కలెక్టర్ సూచించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా చెక్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా మెడిసిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, సంబంధిత అధికారులు ఉన్నారు.