రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని.. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయ అధికారులకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయ రంగారెడ్డి కలెక్టర్ శశాంకతో కలిసి తాగునీటి సరఫరాపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విజయేంద్ర బోయ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యేక దృష్టిసారిస్తూ.. మీమీ స్థాయిలో బాధ్యతాయుతంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎకడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదురొన్నారనే మాటకు అస్కారం లేకుండా అంకితభావంతో ప్రతిఒకరూ విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.
అవసరమైన చోట నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలన్నారు. మున్సిపల్ కార్యాలయాలకు, వాటర్ వర్స్ కార్యాలయాలకు, వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధిలో టోల్ ఫ్రీ, కాల్ సెంటర్ నెంబర్లు ప్రతి ఒకరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని మండలాల పరిధిలో గల నివాస ప్రాంతాలకు సరిపడా నీటి నిలువలు అందుబాటులో ఉన్నాయా? లేదా అన్న అంశంపై అందరికీ అవగాహన ఉండాలని, అవగాహన ఉంటే సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిషరించడానికి వీలవుతుందన్నారు.
మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ, ఎకడైనా లోపాలు గమనించినా వెంటనే వాటిని సరిదిద్దాలని, తాగునీటి వ్యవస్థకు ఇబ్బంది తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా జరుగుతున్నదా లేదా అన్నది మండల అధికారులు, గ్రామపంచాయతీల కార్యదర్శులు చూడాలని ఆయన సూచించారు.
కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. వేసవి కాలంలో నీటి వినియోగం పెరిగి తాగునీటి వనరులు తగ్గిపోతాయని, ఈ సమయంలో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎకడైనా తాగునీటి ఎద్దడి ఏర్పడితే నీటి సమస్యను పరిషరించడం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నం.9347492260కు ఫోన్ ద్వారా గాని, వాట్సప్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎకడా నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని, అవసరమైన చోట బోరు మోటర్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీలత, మున్సిపల్ కమిషనర్లు, వాటర్ వర్స్ అధికారులు పాల్గొన్నారు.
షాబాద్ : పోలింగ్/కౌంటింగ్ కవరేజ్ కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా మీడియా పాసులు (అథారిటీ లెటర్స్) పొందనున్న మీడియా ప్రతినిధులకు కూడా ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడనివారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ నెల 16లోగా సంబంధిత శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం-12(డీ)లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించబడుతుందని స్పష్టం చేశారు. ఫారం-12(డీ) దరఖాస్తులు నోడల్ అధికారి కార్యాలయంతోపాటు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, డీపీఆర్వో కార్యాలయం నుంచి కూడా పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకున్నవారు సంబంధిత శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు.
ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించబడదని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అందుకోసం పోస్టల్ బ్యాలెట్ వినియోగించదల్చిన మీడియా ప్రతినిధులు డీపీఆర్వో కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.