సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ స్టేషన్ల ప్రారంభోత్సంలో తలెత్తిన ప్రొటోకాల్ లొల్లి, ఇతర వ్యవహారాలకు భయపడిన ఆబ్కారీ మంత్రి ఠాణాల ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. ముచ్చటగామూడు సార్లు వాయిదా పడిన నూతన ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సవం ఎట్టకేలకు సోమవారం జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం, ఆర్భాటాలు లేకుండా కొత్త ఎక్సైజ్ స్టేషన్లను స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించారు. ముంద స్తు సమాచారం ఇచ్చి ప్రారంభించేందుకు యత్నిస్తే మళ్లీ ఎక్కడ ఆటంకాలు ఏర్పడుతాయోనని,పరువు పోతుందనే భయంతో మంత్రి అనే పదం లేకుండా, కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా స్టేషన్లను ప్రారంభించారు.
నిధుల కేటాయింపులో ఆర్థిక వ్యవహారాలపై ఒక ప్రజాప్రతినిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మే 14న ప్రారంభం కావల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఎట్టకేలకు సదరు ప్రజాప్రతినిధిని అన్ని విధాల సంతృప్తిపరిచిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు జూన్ 28న మూడోసారి ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఆ ముహూర్తం కూడా కలిసి రాలేదు. తాను అందుబాటులో లేను, వచ్చిన తరువాత చూసుకుందామంటూ ఒక ఎమ్మెల్యే, తనకు సరైన సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా తన ఇలాఖాలో ఏర్పాటు చేస్తున్న స్టేషన్ల ప్రక్రియలో తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై అలక చెందినట్లు ఆబ్కారీ భవన్లో పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. సదరు ప్రజాప్రతినిధిని బుజ్జగించేందుకు ఆబ్కారీ ఉన్నతాధికారులు, మంత్రులు కసరత్తు చేసినా సదరు ఎమ్మెల్యే ససేమిరా అనడంతో చేసేది లేక మూడోసారి కూడా ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సం వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సవలో తలెత్తిన ప్రొటోకాల్, ఆర్థిక వ్యవహారాల లొల్లిపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయినట్లు తెలిసింది. మంత్రి వెళ్లడం వల్లనే ప్రొటోకాల్, ఇతర పంచాదులు వస్తున్నాయని భావించిన పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతోనే కొత్త స్టేషన్ల ప్రారంభోత్సవాన్ని కానిచ్చేయాలని సూచించడంతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే గ్రేటర్లో పరిధిలో 12 స్టేషన్లు, మెదక్, వరంగ్లో జిల్లాల పరిధిలో మరో రెండు ఆబ్కారీ స్టేషన్ ప్రారంభానికి నోచుకున్నాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఆబ్కారీ మంత్రి ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ ఎక్సైజ్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నట్లు ఆబ్కారీ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ డీసీ పరిధిలోని 2యూనిట్ల పరిధిలో ప్రస్తుతం 11 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో హైదరాబాద్ ఈఎస్ పరిధిలో 6 ఠాణాలు, సికింద్రాబాద్ ఈఎస్ పరిధిలో 5 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఆబ్కారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ ఈఎస్ పరిధిలో కొత్తగా బంజారాహిల్స్ ఠాణాను ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్ ఈఎస్ పరిధిలో ఠాణాల సంఖ్య 7కు చేరగా సికింద్రాబాద్ ఈఎస్ పరిధిలో కొత్తగా మారేడుపల్లి, చిక్కడపల్లి ఎక్సైజ్ ఠాణాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సికింద్రాబాద్ ఈఎస్ పరిధిలో ఎక్సైజ్ ఠాణాల సంఖ్య 7కు చేరి, మొత్తం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ల సంఖ్య 14కు చేరింది.
గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల వినియోగం, స్మగ్లింగ్ తదితర నేరాలను అరికట్టేందుకు బీఆఎర్ఎస్ ప్రభుత్వం ఆబ్కారీ శాఖను బలోపేతం చేసే క్రమంలో ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు 2020లోనే ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో 12 ఆబ్కారీ స్టేషన్లు, మెదక్, వరంగల్ డివిజన్ పరిధిలో మరో 2 స్టేషన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో నూతన ఆబ్కారీ స్టేషన్లను ఈ సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభిస్తున్నట్లు మొదట ప్రకటించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మే 14కు వాయిదా వేశారు.