Ravi Teja | మాస్ మహారాజా రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సరసన యువ సంచలన హీరోయిన్, తెలుగమ్మాయి శ్రీ లీల నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ‘మాస్ జాతర’ ఓటీటీకి వస్తోంది. గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 28వ తేదీ నుంచి ‘మాస్ జాతర’ను తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఓ దశలో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసిందని ప్రచారం జరిగింది. అయితే తాజా అప్‌కమింగ్ మూవీస్ లిస్టులో ‘మాస్ జాతర’ను చేర్చడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. మాస్ జాతర కథ విషయానికి వస్తే.. సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. నిజాయితీ, కఠినత్వానికి మారుపేరైన ఆయన వరుసగా ట్రాన్స్ఫర్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఓ మంత్రిని ఎదిరించడంతో వరంగల్ నుంచి శ్రీకాకుళంకు బదిలీ అవుతాడు.అక్కడ ఓ అమ్మాయి (శ్రీ లీల)ను ప్రేమించటం మొదలవుతుంది. ఆమె టీచర్ అని భావించిన హీరో, తర్వాత ఆమె గంజాయి స్మగ్లింగ్‌లో భాగమని తెలుసుకుని షాక్ అవుతాడు.
అదే సమయంలో ఈ డ్రగ్ రాకెట్ వెనుక మరో ప్రమాదకర గ్యాంగ్ ఉందని తెలుస్తుంది. ఈ నెట్‌వర్క్‌ను హీరో ఎలా ఛేదించాడు? ఆ గ్యాంగ్ లీడర్‌ను ఎలా ఓడించాడు? చివరకు కథ ఏ విధంగా ముగిసింది? అనేదే ‘మాస్ జాతర’ కథనం. ఈ సినిమా రవితేజ అభిమానులని కాస్త అలరించిన బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింది.ఈ సినిమాతో రవితేజ తన ఖాతాలో మరో ఫ్లాప్ చేర్చుకున్నాడు. చాన్నాళ్లుగా రవితేజ హిట్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాడు.