రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లావాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ మండలంలోని హిమాయత్‌సాగర్ చెరువు నాలుగు గేట్లను ఎత్తిన సందర్భంగా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి గేట్లను, చెరువులోని నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలినందున పరివాహక ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అధికారులు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలివ్వాలన్నారు. రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలకు అందుబాటులో ఉంటూ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, అక్కడ అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం రాత్రి శేరిలింగంపల్లి, షాద్‌నగర్, మరికొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. దీనిపై ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నందున జిల్లా యంత్రాంగం కూడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉన్నదని.. ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.